నిర్భయ దోషులకు ఉరితీత పూర్తి.
న్యూఢిల్లీ, మార్చి 20
నిర్భయ కేసు దోషులకు ఉరి శిక్ష అమలు అయింది. శుక్రవారం తెల్లవారు జామున అయిదున్నర్ర గంటలకు నలుగురు అక్షయ్ ఠాకుర్ (31) , ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్త (25), వినయ్ శర్మ (26)ల జీవితాలు ముగిసాయి. కేసులో ప్రధాన నిందితుడు రాం సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోఫి మైనర్ కావడంతో మూడేళ్లశిక్ష అనుభవించాడు. ఉరి తీతకు రెండు గంటలముందు కూడ దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ విశ్వ ప్రయత్నాలు చేసారు. నిర్భయ దోషులను ఉరితీయవద్దని కోరారు. వారు దేశసేవ చేసేందుకు రెడీగా ఉన్నారని, దోషులను ఇండియా-పాక్ బార్డర్ కు పంపించాలని లేదా ఇండియా-చైనా సరిహద్దుకు పంపించాలని ఆయన కోరారు. అంతేకాని వారిని ఉరితీయద్దని సూచించారు. దేశ చరిత్రలో నలుగురిని ఒకేసారి ఉరి తీయడం ఇదే మొదటిసారి. దోషులందరూ ముందు రోజు రాత్రి అల్పాహారం తినడానికి తిరస్కరించారు. రాత్రంతా వారు నిద్ర పోలేదని సమాచారం. తీహార్ జైలులో ఖైదీలేవరూ నిద్రపోలేదు. మరోవైపు, జైలు బయట జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. రెండు రోజుల నుంచి తీహార్ జైలు లో తలారి పవన్ జల్లడ్ డమ్మీ ఉరిని ప్రయోగించి చూసుకున్నాడు. నిర్భయ దోషులకు మరణ దండన అమలు కావడంపై నిర్భయ తల్లిదండ్రులతోపాటు దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నా కూతురి ఆత్మ శాంతిస్తుందని నిర్భయ తల్లి ఆశా దేవి వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లకు తమకు న్యాయం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజును దేశంలోని అందరి కుమార్తెలకు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. భారత ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు ఆశాదేవి కృతజ్ఞతలు తెలిపారు.
--