ఆగని కొల్లేరులో బరితెగింపు పర్వం
ఏలూరు, మార్చి 20
కొల్లేరులో బరితెగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. యథేచ్ఛగా మంచినీటి చెరువుల పేరుతో అభయారణ్యాన్ని తవ్వేస్తున్నారు. అటవీ చట్టాలకు పాతరేస్తున్నారు. సుప్రీం కోర్టు నిబంధనలు తుంగలో తొక్కుతున్నా ఫారెస్టు, రెవెన్యూ, పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కొల్లేరు ఆక్రమణల పర్వం కళ్లెదుట, కాగితాల్లో సర్వే నంబర్లతో సహా తేటతెల్లం అవుతున్నా అడ్డుకోవడంలో అటవీ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. రాజకీయ చట్రంలో ఇరుసులా ఇరుక్కుని బిక్కుబిక్కుమంటూ వీరు విధులు నిర్వహిస్తున్నారు.ఎన్నికలు దగ్గరపడేకొద్ది కొల్లేరులో ఆక్రమణలపర్వం ఊపందుకుంది. 2016 జూలై నెలలో మండవల్లి మండలం పులపర్రు, చింతపాడు, దెయ్యంపాడు, కైకలూరు మండలం కొల్లేటికోట, కొట్టాడ గ్రామాల్లో పట్టపగలు చెరువులను తవ్వేశారు. అప్పట్లో పులపర్రులో అడ్డుకున్న ఫారెస్టు అధికారులను తరిమేశారు. జీపును సైతం పక్కకు తోసేశారు. ఇవే ఘటనలు పులపర్రులో తిరిగి పునరావృతమయ్యాయి. ఇటీవలే నాలుగు పొక్లెయిన్లతో తాగునీటి చెరువు పేరుతో భారీ గట్లు వేశారు. యథావిధిగా మహిళలను ముందుంచి అటవీ అధికారులను అడ్డుకున్నారు. తవ్వకాల తెర వెనుక ప్రజాప్రతినిధులు ఉన్నారనే విషయం జగమెరిగిన సత్యం.పులపర్రు గ్రామంలో జరుగుతున్న ఆక్రమణను వెలుగులోకి తీసుకొస్తున్న పాత్రికేయులపై అక్రమార్కులు మహిళలతో దాడులు చేయిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తుంటే, తిరిగి మహిళలతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారు. అగ్గిపెట్టె కూడా తీసుకెళ్లకూడదనే నిబంధనలు ఉన్న అభయారణ్యంలో పొక్లెయిన్లతో తవ్వుతుంటే సీజ్ చేయలేని అటవీ సిబ్బంది, అంతా అయిపోయిన తర్వాత తూతూమంత్రగా కేసులు నమోదు చేసి సరిపెడుతున్నారు.పట్టపగలు పులపర్రు గ్రామంలో రెండోసారి కొల్లేరు అభయారణ్యంలో అక్రమ తవ్వకాలు జరిగాయి. ఈ ఘటనపై యథావిధిగా అటవీ అధికారులు రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రతి ఏటా ఆక్రమణలు జరగడం, కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారుతోంది. పులపర్రు గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ‘అంతా నేను చూసుకుంటాను మీరు కానిచ్చేయండి’ అంటూ ఆక్రమణదారులకు భరోసా ఇవ్వడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని అధికారులు భావిస్తున్నారు. మండవల్లి మండలం పులపర్రులో అభయారణ్యంలో చెరువు గట్లు ఏర్పాటు చేసిన ఘటన వాస్తవం. దీనిపై పూర్తి విచారణ చేయాలని సిబ్బంది ఆదేశించాను. అటవీ శాఖ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. గ్రామస్తులకు అభయారణ్య చట్టాలను వివరించి ఏర్పాటు చేసిన అక్రమ గట్లను తొలగిస్తాం. కొల్లేరు అభయారణ్యాన్ని కుదింపు చేయాలని కొల్లేరు పరివాహక ప్రజలు కోరుతున్నారు.