నకిలీ హ్యాండ్ శానిటైజర్ తయారీ కేంద్రంపై పోలీసుల దాడి..అరెస్ట్
హైదరాబాద్, మార్చి 20
ఎదుటివారి అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు తెగబడిపోతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్‌లు, శానిటైజర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అందరూ మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని ఒకవైపు పేర్కొంటున్నప్పటికీ భయాందోళన కారణంగా ప్రజలందరూ వీటిని కొనుగోలు చేసి వాడుతున్నారు. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమదందాకు తెరలేపారు. నకిలీ శానిటైజర్లను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. సమాచారం మేరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లి ప్రాంతంలో గల రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు, ఆయుష్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో నకిలీ హ్యాండ్ శానిటైజర్ తయారీ కేంద్రంపై దాడి చేశారు. సోదాల్లో లక్షల విలువ చేసే నకిలీ శానిటైజర్, ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. 100 మిల్లీలీటర్ల శానిటైజర్ల 25 వేల యూనిట్లు, మాస్క్‌లు, రూ. 40 లక్షల విలువైన ముడి సరుకులను అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇప్పటివరకు రూ.కోటికి పైగా విలువచేసే నకిలీ శానిటైజర్ బాటిళ్లను విక్రయించినట్లుగా సమాచారం. అదేవిధంగా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ శానిటైజర్లను తయారీ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి రూ. 10 లక్షల విలువచేసే శానిటైజర్లను స్వాధీనం చేసుకున్నారు.