కుటుంబసభ్యులకు డెడ్ బాడీల అప్పగింత
న్యూఢిల్లీ, మార్చి 20
నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరి శిక్ష పూర్తైంది. ఈ కేసులో ఎన్నో ట్విస్ట్‌లతో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా మారింది.. చివరికి ఎనిమిదేళ్ల తర్వాత నలుగురికి మరణ శిక్ష అమలు చేశారు. తీహార్ జైల్లో నలుగురు ఉరి తాళ్లకు వేలాడారు.. శిక్ష అమలుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఉరి తర్వాత నలుగురు చనిపోయినట్లు డాక్టర్లు కూడా నిర్ధారించారు.. తర్వాత నలుగురి మృతదేహాలను జైలు నిబంధనల ప్రకారం ఆస్పత్రికి తరలిస్తారు.ఉరి శిక్ష అమలు తర్వాత నలుగురి మృతదేహాలను దీన్ దయాళల్ ఆస్పత్రిలో సరిగ్గా ఉదయం 8 గంటల సమయంలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. తర్వాత కుటుంబ సభ్యుల్ని పిలిపించి.. డెడ్‌బాడీలను గుర్తించి.. తర్వాత వారికి అప్పగించారు. జైల్లో ఉన్నంతకాలం నలుగురు దోషులు పనులు చేసి సంపాదించిన డబ్బును వారి కుటుంబాలకు అందజేశారు.ఉరికి ముందు నలుగురు దోషులు తీహార్ జైల్లో క్షణమొక యుగంలా గడిపారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. అలాగే జైలు అధికారులు గురువారం హైలెవల్ సమావేశం నిర్వహించారు. ఉరికి ముందు నలుగురు దోషులు తమ సెల్‌లో విశ్రాంతి లేకుండా గడిపారు.. వారిలో భయం కనిపంచింది. ముఖేష్ సింగ్, వినయ్ శర్మ గురువారం రాత్రి భోజనం చేశారు. పవన్ గుప్తా మాత్రం భోజనం చేయడానికి నిరాకరించాడు. గత 24 గంటల పాటూ ఇక నలుగురి కదలికల్ని గమనించడానికి 15మందిని జైలు అధికారులు నియమించారు. జైలు నిబంధనల ప్రకారం తెల్లవారుజామున నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు.. వారి చివరి కోరిక గురించి అడగ్గా.. నలుగురు మౌనం వహించారు.. తర్వాత వేకువజామున 5.30గంటలకు ఉరి శిక్ష అమలు చేశారు.