మెడిసిన్ చదివే అమ్మాయిలే టార్గెట్
హైద్రాబాద్, మార్చి 20
ఆరేళ్లలో రూ.6 కోట్ల సంపాదన.. పెట్టుబడి ఏంటో తెలిస్తే షాక్!
సోషల్ మీడియా ద్వారా వైద్య విద్యార్థినులను పరిచయం చేసుకొని రూ.కోట్లు దండుకుంటున్న నిందితుణ్ని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జోగాడ వంశీకృష్ణ (30) అలియాస్ హర్ష 2015 నుంచి ఈ నేరాలకు పాల్పడుతూ దాదాపు ఆరేళ్లలో రూ.6 కోట్లు వైద్య విద్యార్థినుల నుంచి దండుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాకినాడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో వంశీ చదువు మధ్యలో వదిలేశాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అడ్డదారులు తొక్కాడు. మెడిసిన్ చదివే విద్యార్థినుల వద్ద డబ్బు ఎక్కువగా ఉంటుందని భావించి, వారి సోషల్ మీడియాలో వారి వెంట పడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లో ఫేస్‌బుక్ ఖాతాలున్న వైద్య విద్యార్థినులను వెతికి మరీ వారితో స్నేహం చేసేవాడు. వారి పుట్టినరోజులకు శుభాకాంక్షలు తెలిపేవాడు. అలా పరిచయం పెంచుకొని, చాటింగ్ చేసేవాడు. తర్వాత తనకు డబ్బులు అవసరమంటూ నగదు బదిలీ చేయించుకొనేవాడు. ఇలా తొలుత 2015లో హైదరాబాద్‌కు వచ్చిన వంశీకృష్ణ రెండేళ్లు ఇక్కడే ఉన్నాడు. వైద్య విద్యార్థుల నుంచి నాలుగేళ్లలో రూ.4 కోట్లు దండుకున్నాడు.మోసపోయిన కాకినాడకు చెందిన ఓ యువతి రెండున్నరేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గట్టిగా గాలింపు చర్యలు చేపట్టడంతో.. సెప్టెంబరు, 2018లో కాకినాడ రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు. ఆ సమయంలో అతని నుంచి రూ.1.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బెయిల్‌పై విడుదలై మళ్లీ అదే దందాకు తెరతీశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వైద్య విద్యార్థినులు, వారి స్నేహితులను పరిచయం చేసుకుని రెండేళ్లల్లో రూ.2 కోట్ల వరకూ వారి నుంచి గుంజాడు.నమ్మకం కలిగాక భారీగా డబ్బులు గుంజి, తర్వాత ఆ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేయడం చేయడం వల్ల అతని ఆచూకీ తెలుసుకోవడం కష్టమైందని పోలీసులు వెల్లడించారు. కేవలం ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా అపరిచితుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టిన విధానం చూసి పోలీసులు విస్మయం చెందారు. ఇలా ఆరేళ్ల నుంచి మోసాలకు పాల్పడుతున్న ఆర్థిక నేరగాడు వంశీకృష్ణ హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్య విద్యార్థిని, ఆమె బంధువుల నుంచి ఇటీవల రూ.60 లక్షలు వసూలు చేయడంతో వారు కేసు పెట్టారు. అనంతరం పోలీసుల విచారణలో వంశీ ఆర్థిక లీలలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ వైద్య విద్యార్థిని దగ్గర రూ.10 లక్షలు తీసుకున్న వంశీకృష్ణ.. ఆమెకు తెలియకుండా ఆమె స్నేహితులు, బంధువుల నుంచి రూ.50 లక్షలు నగదు బదిలీ చేయించుకున్నాడని వివరించారు. యువతుల నుంచి రూ.లక్షలు కొల్లగొడుతున్న వంశీకృష్ణ క్రికెట్ బెట్టింగ్‌లు, గుర్రప్పందాలు ఆడేవాడు.