నిర్భయ కేసులో దోషులకు మరణదండన
-తీహార్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరితీసిన తలారి - రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు..
-చివరి కోరిక చెప్పని దొషులు:జైలు అధికారులు -నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని నిర్భయ తల్లిదండ్రులు హర్షం
న్యూఢిల్లీ, మార్చి 20
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు మరణదండన అమలు చేశారు. దోషులుగా తేలిన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను తీహార్ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు. జైలు అధికారుల సమక్షంలో మీరట్ నుంచి వచ్చిన తలారి పవన్.. మనీలా తాళ్లతో ఉరి తీశారు. ఉరి అమలుకు ముందు నిర్భయ దోషులు చివరి కోరిక చెప్పలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. వారు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారని తెలిపారు. గత రాత్రి భోజనం చేయలేదని, ఉరి తీసే గంట ముందు బ్రేక్ ఫాస్ట్‌కు నిరాకరించారని పేర్కొన్నారు. ఉరి అమలు ముందు రోజు (గురువారం రాత్రి) వారిని విడివిడిగా ప్రత్యేక గదుల్లో ఉంచామని తెలిపారు. శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటలకు వారు నిద్ర లేచారని, అప్పటికే సుప్రీం కోర్టు వారి చివరి పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపారు. దోషులను స్నానం చేయాలని కోరగా.. ఎవరూ అంగీకరించలేదని అన్నారు. కాగా, నిర్భయ దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను ఈరోజు ఉదయం 5:30 గంటలకు తీహార్ సెంట్రల్ జైలులోని జైలు నెంబర్ 3లో ఉరితీసారు.దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్ కేంద్ర కారాగారంలో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసారి. ఉరిశిక్షను తప్పించుకునేందుకు చివరి వరకు దోషులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నిర్భయ దోషులకు ఇక ఎటువంటి చట్టపరమైన అవకాశాలు మిగిలిలేవని ఢిల్లీ కోర్టు గురువారం స్పష్టం చేయడంతో ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు చేశారు. దోషులను ఉరి తీయడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం ప్రకటించారు. తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని వ్యాఖ్యానించారు.