చైనాలో నమోదు కాని కరోనా కేసులు
బీజింగ్, మార్చి 20
తమ దేశంలో తొలిసారి ఒక్క కరోనా వైరస్ కేసు నమోదుకాలేదని చైనా గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస్ వెలుగులోకి వచ్చిన మూడు నెలల తర్వాత కోవిడ్ 19 అదుపులోకి తీసుకురావడం వెనుక చైనా పెద్ద యుద్ధమే చేసింది. హుబే ప్రావిన్సుల్లో పూర్తిగా ప్రజా రవాణను నిలిపివేసి, ప్రజలను ఇళ్లకే పరిమితం చేసిన చైనా.. ఒక విధంగా అత్యంత కఠిన చర్యలనే చేపట్టింది. తొలుత కోవిడ్‌ను గుర్తించిన ఓ వైద్యుడు.. ఇదో కొత్తరకం వైరస్ అని, ఇది వేలాది మంది ప్రజలకు పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించాడు. అయితే, ఆయన హెచ్చరికలను పట్టించుకోలేదు సరికదా.. అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారు. మూడు వారాల తర్వాత మాత్రం వాస్తవాన్ని గ్రహించి.. తదుపరి చర్యలు చేపట్టారు.మరోవైపు, చైనాలో కొత్త కేసులు రెండు రోజుల నుంచి నమోదు కాకపోయినా, ముప్పు మాత్రం తొలగిపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు. వరుసగా రెండు వారాలు ఎలాంటి కేసులు నమోదు కాకుంటేనే వైరస్‌ను కట్టడిచేసినట్టు భావించాలని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఆంక్షలను సడలించి, ప్రజా రవాణాను పునరుద్దరించిన తర్వాత వైరస్ మళ్లీ విజృంభిస్తుందేమోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా చేపట్టిన చర్యలు వైరస్‌ను ప్రస్తుతానికి అరికట్టినా, రెండో దశలో పరిస్థితి ఎలా ఉంటుందోనని, ఇవి స్థిరంగా ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వైరస్‌ను కట్టడిచేయడంలో భాగంగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా చర్యలు తీసుకున్నారనే విమర్శులు వినిపిస్తున్నా.. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లు ప్రస్తుతం దీనిని అనుసరిస్తున్నాయి. లాక్‌డౌన్ ప్రకటించి, ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. జనవరిలో లాక్‌డౌన్ అకస్మాత్తుగా ప్రకటించడంతో పలువురు విదేశీయులు వుహాన్‌లో చిక్కుకున్నారు. అమెరికాకు చెందిన స్టీఫెన్ కిర్కేబై అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి చైనాకు రాగా.. ఈ సమయంలో లాక్‌డౌన్ ప్రకటించారు. తాజాగా, స్టీఫెన్ మాట్లాడుతూ.. యుద్ధం ముగిసినట్లే.. కానీ తాము హుబే నుంచి ఇప్పుడే వెళ్లలేం కానీ, స్థానిక ప్రజల స్వేచ్ఛ పునరుద్ధరించబడిందన్నారు.ఇక, వుహాన్‌లో కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై కొత్త నివేదిక గురువారం వెల్లడించారు. వుహాన్‌లో కరోనా మరణాల రేటు 2 నుంచి 3.4 శాతంగా ఉంటుందని అంచనా వేసినా.. తాజా నివేదికలో మాత్రం ఇదది 1.4 శాతంగా నమోదయ్యింది. కరోనా వైరస్‌కు వుహాన్ ప్రధాన కేంద్రం కావడంతో మరణాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. వైరస్ బాధితులతో వుహాన్‌లోని హాస్పిటల్స్ ఇన్నీ కిక్కిరిసిపోయాయి. వ్యాపారం సంస్థలు, పాఠశాలల మూసివేత, సామాజిక దూరం పాటించడం లాంటి చర్యలు వ్యాధి వ్యాప్తిని తగ్గించగలుగుతాయి. అమెరికా లాంటి దేశాలలో మరణాలు రేటు తక్కువగా ఉంటుందని కొందరు నిపుణులు అంటున్నారు. కానీ 1.4% కేసు మరణాల రేటు ఇప్పటికీ చాలా మరణాలను సూచిస్తుంది. ఇది ఫ్లూ మరణాలతో పోల్చిచూస్తే చాలా ఎక్కువే.