అరుణాచలం: మహాలింగము.....
ఆకాశంలో జాబిల్లి వెన్నెలలను కురిపిస్తున్నాడు. నక్షత్రాలు చీకట్లో మెరసిపోతున్నాయి. దూరంగా నీలంగా ఉన్న కొండలు, ఎన్నో యేండ్ల బరువు మోసుకుంటూ ఉన్నవి. ఇవన్నీ ఎలాగ ఉత్పత్తి అయినవి.. ఉహూ తెలియదు..! పోనీ ఈ గులాబిని చూడు. ఇది మొన్ననే కదూ పుట్టింది, దీన్నెవరు సృజించారు.. ఉహూ మొన్న మొగ్గగా ఉండినది. ఈరోజే పూచినది. ఆనందంగా పరిమళాలు వెదజల్లుతూంది. ఒక్కొక్క రేకులో ఎన్నోనాళాలు. చూడటానికి ముచ్చటగా ఉన్నది. కాని దీనిని పుట్టించినవానిని నేను చూడలేదు. ఎవరో తెలియదు. మన అరచేతిని చూచుకుంటే అందులో అడ్డదిడ్డంగా ఎన్నో రేఖలున్నవి. ఒకగీత మనం గీయగలమా.. వీనినన్నిటిని ఇసుమంతైనా గర్వం లేకుండా కల్పించే ఆ మహాశిల్పి ఎంత, ఎట్టి ఘటకుడై ఉండాలి..? మనకండ్లకు కనపడక, ఎవరికీ వెదకడానికి వీలుకానట్టు గూఢంగా గుహలోఉన్నట్లున్నాడు. వేదమున్నూ అదే చెప్పింది."ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహా ప్రవిష్టౌ పరమే పరార్ధేయో వేద నిహితం గుహాయామ్" ఆయన చేసిన సృష్టిలో భిన్నత్వం కనుపించక ఒకే ఒక ఏకత్వం కనిపిస్తూ ఉండడం వలన, ఇంతా చేసే ఆ ఆసామీ ఎవడో ఒకడే అయివుండాలని ఈ దృష్ట ప్రపంచం స్పష్టపరుస్తున్నది. తర్కం ఈలాటిదాన్ని 'లింగమ్' అని అంటుంది.అగోచరమైన వస్తువును గోచరింపచేసేదే లింగం. చూడబోతే సర్వమూ లింగమే. కాని శాస్త్రం ఈశ్వరుణ్ణి నిర్దేశించే ఒక వస్తువును మాత్రమే లింగమని అన్నది. 'నీకు సృష్టికర్తను చూడవలెనన్న ఇచ్ఛవుంటే శివాలయానికి వెళ్ళి శివలింగం చూడు' అన్నారు పెద్దలు. అన్ని లింగాలూ శివ స్వరూపాన్ని నిర్దేశిస్తున్నప్పటికీ, స్ఫటికలింగంలో ఆయన స్వరూపం స్ఫుటంగా వ్యక్తగమవుతున్నది. స్వతహాగా దానికి రంగులేదు. దానిదాపున మంకెనపువ్వు పెట్టు, ఎఱ్ఱబారుతుంది. నీలిగోరింట పెట్టు, నీలి అవుతుంది. పచ్చపువ్వు పెట్టు, పచ్చనవుతుంది. లింగములలో బ్రహ్మపీఠము, విష్ణుపీఠము, శివపీఠము అని మూడుపీఠాలున్నవి. శ్రీకాళహస్తి క్షేత్రంలోని గర్భగృహమూర్తి యందు సాలెపురుగు, పాము, ఏనుగు.. మూడు స్వరూపాలు కలసి ఉన్నవని ఐతిహ్యం. అదే క్షేత్రమునకు ఇరువది మైళ్ళ దూరంలో 'గుడిమల్ల' మను మరొక శివస్ధాన మున్నది. అందలి మూర్తి పరశురామ ప్రతిష్ఠ. లింగము యొక్క అధోభాగం గంధర్వరూపం, మధ్యభాగం పరశురాముడు, శీరం శివ స్వరూపం. బ్రహ్మ ఒకప్పుడు శాపవశాత్తు, చిత్రసేనుడనే గంధర్వుడైనాడట. అందుచే లింగపు అధోభాగం గంధర్వరూపం బ్రహ్మను చూచిస్తుంది. 'మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణుపిరూణ, అగ్రతః శివరూపాయ' అని, అశ్వత్థవృక్షం గూర్చిన్నీ ఇట్టి వాడుకే ఉన్నది. ఊర్థ్వమూల మథశ్శాఖ మశ్వత్థం ప్రాహుర వ్యయమ్' అన్న గీతావాక్యం ఇతర వృక్షాలవలెకాక సంసార వృక్షానికి మూలం ఊర్థ్వభాగమందున్నూ, శాఖలు అధోభాగమందున్నూ ఉన్నవని చెప్పుతూంది. లింగమును పూజించవలెనంటే నర్మద నుండి లింగం రావాలి. పంచాయతన పూజకు ఐదు మూర్తులు, 'ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణబాధం, మహేశ్వరం,' ఏకలింగ పూజచేస్తే, నివేదన చండేశ్వరునికి అర్పితమవుతుంది. అందుచేతనే శివాలయాలలో ప్రసాదాలుండవు. గర్భగుడిలోకి బ్రాహ్మలు సైతమూ పోరాదు. అభిషేక జలమునూ, స్వామి నిర్మాల్యమునూ తొక్కవలసివస్తుంది. అయితే ఎవరో ఒకరు లోనికి వెళ్ళకపోతే పూజాదికాలు ఎట్లా జరుగుతవి.. దీక్ష పొందిన ద్విజులు దీనికై ఏర్పడి ఉన్నారు. పుస్తకమును కంటికి చాలా దగ్గరగా పెట్టినా కనపడదు. పుస్తకంలోని విషయాలను అప్పుడు గ్రహించలేము. స్వామి దర్శనమునకున్నూ ఇదే అనువర్తిస్తుంది. అతి దూరంగానూ కాక అతి దగ్గరగానూ కాక స్వామికి ఎదుట నిలుచుని దర్శనం చేయడం ఉత్తమం. ఇండ్లలో శివలింగం పూజ మాత్రం చేయరాదు. పంచాయతన పూజ చేయాలి.
దేశంలో ఆయా ప్రదేశాలలో దొరకే శిలలు పంచమూర్తులు...
1) సూర్యమూర్తి తంజావూరు దాపున ఉన్న నదిలో స్ఫటికరూపంగా దొరుకుతుంది.
2) గణనాథుని స్వరూపమయిన ఎర్రరంగు శిలగంగానది కుపనదియగు శోణభద్రలో దొరుకుతుంది.
3) సాలగ్రామం నేపాళంలోని గండకీనదిలో కన్పడుతుంది.
4) అంబిక కాళహస్తిలోని స్వర్ణముఖిలో అగపడుతుంది.
5) బాణలింగం నర్మదలోని ఓంకార కుండంలో లభిస్తున్నది.
వేదాలు ఈశ్వరుని వర్ణిస్తూ ఆయనకు కన్నులు లేవు. కాళ్ళూలేవు, చెవులులేవు. అయినా ఆయన అన్నిటినీ చూడగలడు, అన్నిటినీ చేయగలడు అని చెప్పినవి. సర్వద్రష్టయైన సర్వేశ్వరునికి కన్నులు లేవంటే ఆయన అమూర్తియని భావము. రూపరహితమైన బాణలింగం ఆయన నిరవయవత్వం సూచిస్తుంది. అది వర్తులాకారంగా ఉన్నందున ఆద్యంతరహితం అని తెలుపుతుంది. స్ఫటికానికి రంగులేదు. కనుక స్ఫటిక లింగం నిర్గుణ చిహ్నం. స్ఫటిక లింగాన్ని గులాబి పువ్వుతో అలంకరిస్తే అదియున్నూ ఎరుపు అవుతుంది. అట్లే ఏరూపములో మనం ఈశ్వరుని ధ్యానిస్తామో ఆ ఆకృతినే ఆయనయున్నూ అనుగ్రహార్థం తాలుస్తాడు. ఆయనకొక రూపమంటూ ప్రత్యేకించి లేదు, 'లోకంలోని ఉత్కృష్టవస్తువులన్నీ నా రూపాలే.' ఐశ్వర్యం. అందం, శాంతం, కరుణ, సహిష్ణుత, వాసన, ఇవన్నీ ఒక ఆకృతిపొందితే అది నారూపే. భక్తునికి మేలి వస్తువులలో ప్రీతి ఉంటే ఆ వస్తు స్వరూపంగావనే నేనాతనికి దర్శన మిస్తున్నాను. కాని అంతా మాయే, అని ఆయన నారదున కుపదేశిస్తాడు. అనగా మనభావంకొద్దీ ఆయన ఆకృతి. మనం తలచుకు ంటే ఆయన గుణి, లేనిచో నిర్గుణుడు. నిర్గుణ చిహ్నమైన స్ఫటికలింగం శ్రేష్ఠమైన పరమేశ్వర మూర్తులలో ఒకటి. దాని దర్శనం శ్రేయస్కరం. ఆ కారణం చేతనే సన్న్యాసులు స్ఫటికలింగాన్ని పూజించడం. ఏ శివాలయానికి వెళ్ళినా, ఈ క్రింది క్రమం మనం గమనింపవచ్చు...
నైరృతి దిక్కున విఘ్నేశ్వరుడు,
పడమట సుబ్రహ్మణ్యుడు,
ఉత్తరమున చండేశ్వరుడు,
దక్షిణమున దక్షిణామూర్తి,
ఆగ్నేయమున సోమస్కందుడు,
ఈశాన్యమున నటరాజ, భైరవ మూర్తులు ఉంటారు.
ఈ క్రమం అగమశాస్త్రం విధించింది...
|| ఓం నమః శివాయ ||
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో