నిరాండంబరంగా ఉగాది పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి వేడుకలు
ఈ నెల 25న దేవాదాయ శాఖ కార్యాలయంలో పంచాంగ శ్రవణం -లైవ్ టెలికాస్ట్ ద్వారానే పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి వేడుకలను వీక్షించాలి -భద్రాద్రి ఆలయంలోపలే శ్రీసీతారాముల కళ్యాణోత్సవం -భక్తులెవరికీ అనుమతి లేదు -ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తాం -బహిరంగ ప్రదేశాల్లో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించవద్దు -రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో దర్శనాలను రద్దు చేసాం -భక్తులు దర్శనాల కోసం ఆలయాలకు రావద్దు -దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 21
ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తుందని, అయితే ప్రాణాంతక కరోన వైరస్ కట్టడి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు కూడా భక్తులకు అనుమతి లేదన్నారు. ఉగాది పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి వేడుకలు, ఆలయాల్లో దర్శనాల రద్దుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కేవి. రమణాచారితో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సీయం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాల్లో దర్శనాలను రద్దు చేశామన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఉగాది వేడుకలతో పాటు సామూహిక శ్రీరామనవమి వేడుకలను నిర్వహించవద్దని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశించిన నేపథ్యంలో ఎటువంటి ఆడంబరాలకు తావు లేకుండా పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.ఈ నెల 25 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ కార్యాలయంలోనే ఉదయం 10 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి లైవ్ ద్వారా టీవీల్లో ఉగాది పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని కోరారు. భద్రాద్రిలో యథావిధిగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తామని, కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయన్నారు. బహిరంగ వేడుకలు నిర్వహించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తామని చెప్పారు. ఈసారి కళ్యాణ ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించలేదన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి డోర్ డెలీవరి ద్వారా శ్రీ సీతారాముల స్వామివారి తలంబ్రాలు పంపిస్తామని చెప్పారు. మరోవైపు కరోనా వ్యాప్తి నివారణకు దేవాదాయ శాఖ ఆద్వర్యంలో సుదర్శన, మృత్యుంజయ హోమాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ శ్రీనివాసరావు, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.