.కరోనా...ఇంటికే పరిమితం కావాలి
యువతకు వార్నింగ్ ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
న్యూ డిల్లీ, మార్చి 21
నోవెల్ కరోనా వైరస్ వల్ల వృద్ధులే ఎక్కువ శాతం చనిపోతున్నారన్నది వాస్తవమే. కానీ యువతీయవకుల్ని కూడా ఆ మహమ్మారి పట్టిపీడిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేసింది. వైరస్ వల్ల టీనేజీ యువత కూడా తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అదనమ్ గేబ్రియాసిస్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు రెండున్నర లక్షలకు చేరుకున్నది. మరణాల సంఖ్య పది వేలు దాటింది. అయితే వైరస్ ఛాయలు ప్రతి రోజూ ఓ కొత్త మైలురాయిని చేరుకుంటున్నట్లు టెడ్రోస్ తెలిపారు. యువత వల్లే వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు కూడా డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. ఎక్కువ శాతం మంది వృద్ధులే మరణిస్తున్నా.. వైరస్ మాత్రం యువత వల్ల వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోందన్నారు. అందుకే అన్ని దేశాలు దాదాపు భారీ సమూహాలను నిలువరిస్తున్నాయి. మాకేం కాదన్న ధోరణితో యువత ఉంటోందని, కానీ వారి వల్లే ఆ వైరస్ వాళ్లవాళ్ల ఇండ్లల్లోకి ప్రవేశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దాంతోనే బామ్మలు, తాతయ్యలు, తల్లితండ్రులకు సోకుతున్నట్లు ఓ అంచనాకు వచ్చారు. యువకుల్లో కరోనా లక్షణాలు కనిపించకపోయినా.. వారు మాత్రం హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. యువకుల్లో మరణాల సంఖ్య ఒక్క శాతం కన్నా తక్కువే ఉన్నా.. వారు ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.