22 న తెలంగాణ వైన్ షాపులు బంద్
హైదరాబాద్, మార్చి 21
జనతా కర్ఫ్యూకు మద్దతుగా రేపు తెలంగాణ వైన్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఇంతకుముందెన్నడూ ఎరుగని విపత్తును కరోనా రూపంలో ప్రపంచం ఎదుర్కొంటోందని.. కరోనా మహామ్మారిని ఎదుర్కొనేందుకు భారతీయులు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి పేర్కొన్న విషయం తెలిసిందే. రేపు దేశవ్యాప్తంగా ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పేరుతో స్వీయ నిర్బంధం విధించుకోవాలని కోరారు. అందరూ ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలని కోరారు. అత్యవసర సేవల సిబ్బందికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ జనతా కర్ఫ్యూకు తెలంగాణ వైన్ డీలర్లు స్వచ్ఛందంగా తమ మద్దతును ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలను రేపు మూసివేస్తున్నట్లు తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు డి.వెంకటేశ్వర రావు ప్రకటించారు. మొత్తం 2,400 వైన్ షాపులు రేపు బంద్ పాటించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 700 బార్ షాపులు బంద్ అయినట్లు ఆయన పేర్కొన్నారు.