ఎంసెట్, నీట్, ఐఐటీ మేయిన్స్ విద్యార్థులకు టి-సాట్ ప్రత్యేక పాఠ్యాంశాలు
హైదరాబాద్, మార్చి 23
ఎంసెట్, నీట్, ఐఐటీ మేయిన్స్ విద్యార్థుల కోసం ప్రతి యేటా ప్రసారం చేస్తున్న అవగాహన పాఠ్యాంశాల్లో భాగంగానే ఈ యేడాదీ 2020 సంబంధించి టి-సాట్ నెట వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రసారం చేస్తోంది. మార్చి 24వ తేదీ నుండి మే మూడవ తేదీ వరకు 43 రోజులు 500 ఏపిసోడ్స్ విద్యార్థులకు ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి.ఎంసెట్, నీట్, ఐఐటీ మేయిన్స్ విద్యార్థుల కోసం టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రసారం చేస్తున్న అవగాహన పాఠ్యాంశాలకు సంబంధించిన వివరాలను సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రటనలో వివరించారు. మే నాల్గవ తేదీ 2020న జరిగే తెలంగాణ ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఈ యేడాదీ సుమారు 500 గంటలు, 43 రోజుల పాటు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. ఆరు సబ్జెక్టులు మ్యాథ్స్-1&2, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ మరియు జువాలజీ సబ్జెక్ట్ లకు సంబంధించి అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధింపబడిన పాఠ్యాంశాలు ప్రసారమౌతాయన్నారు. మార్చి 24వ తేదీ నుండి ప్రారంభమయ్యే అవగాహన పాఠ్యాంశాలు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు, సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ‘నిపుణ’ ఛానల్ లో, ఉదయం ఆరు గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 12 గంటల వరకు విద్య ఛానల్ లో ప్రసారమౌతాయని సీఈవో తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల మనస్సును చూరగొన్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రతియేటా ఇటువంటి ప్రసారాలు చేస్తూనే ఉందని, ఈ యేడాది చేసే ప్రసారాలనూ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని సీఈవో కోరారు. ప్రసారాల సమయంలో అందుబాటులో లేని విద్యార్థులు టి-సాట్ యాప్, యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాను అనుసరించవచ్చని, విద్యార్థుల తల్లిదండ్రులూ తమ పిల్లలకు మంచి విజ్ఞానాన్ని అందించేందుకు టి-సాట్ నెట్ వర్క్ ను అనుసరించే విధంగా అవగాహన కల్పించాలని సీఈవో శైలేష్ రెడ్డి కోరారు.