శ్రీవారి ఆలయంలో మార్చి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల, మార్చి 23
శ్రీవారి ఆలయంలో మార్చి 25వ తేదీ తెలుగు సంవత్సారాది శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆస్థానం నిర్వహించనుండడంతో మార్చి 24న మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ, ఉగాది, ఆణివార ఆస్థానం, హ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 6.00 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది అత్యంత పవిత్ర కార్యక్రమంగా ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తారు. మార్చి 25న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శ్రీవారి ఆలయంలో మార్చి 25వ తేదీ బుధవారం శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జరుగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.