యదేచ్ఛగా మినరల్ వాటర్ దందా
కరీంనగర్, మార్చి 24
ఎండలు రోజురోజుకు పెరుగుతుండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మినరల్ వాటర్ దందా ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ అన్న చందంగా కొనసాగుతోంది. పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు పుట్టుకొస్తుండగా, మినరల్ వాటర్ పేరిట జనరల్ వాటర్ సప్లై చేస్తున్నారు. దీనికితోడు కాలం చెల్లిన వాటర్ క్యాన్లు, శుభ్రపర్చని డబ్బాలతోనే వాహనాల్లో తరలిస్తూ కష్టమర్లకు అందిస్తూ ఇష్టారాజ్యంగా డబ్బులను వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నాయి. శుద్ధజలం పేరిట అపరిశుభ్ర నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. పేరుకు మినరల్ వాటర్ వ్యాపారం కానీ, జనరల్ వాటర్‌నే ప్రజలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటుడమేకాకుండా ప్లాంట్ల నిర్వహణలో నాణ్యత, శుభ్రత పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. పట్టణాలే కాకుండా కొన్ని గ్రామాల్లో సైతం నిబంధనల ఊసే లేదు. సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోవడం లేదు. వేసవి కాలం రావడం, ఎండలు రోజురోజుకు పెరుగుతుండటం ఈ వాటర్ దందా జోరుగా సాగుతోంది. వేసవిలో ఈ దందాను మరింత పెంచుకునేందుకు వ్యాపారులు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు బోర్లు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రూ.పదిలోపే ఖర్చయితే ఒక్కొ క్యాన్‌కు రూ.30నుంచి రూ.40వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఐఎస్‌ఐ గుర్తింపు ఉన్న యంత్రాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా, ఈ నిబంధనలను పాటించకుండా నాసిరకం యంత్రాలతో లైసెన్స్‌లు లేకుండా వ్యాపారం సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వేళ్లమీద లెక్కపేట్టే సంఖ్యలో మాత్రమే నిబంధనలకు అనుగుణంగా ప్లాంట్లు నడుస్తున్నట్లు సమాచారం. వాటర్ క్యాన్‌లను ప్రతీ సంవత్సరం మార్చాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి పాత క్యాన్లనే వాడుతున్నారు. చాలాచోట్ల ఒక చిన్న గదిలో ప్లాస్టిక్ క్యాన్‌లను ఏర్పాటు చేసుకొని జనరల్ వాటర్ డంప్ చేసుకుని, వాటినే మినరల్ వాటర్‌గా సరఫరా చేస్తూ దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. ఎండలు తీవ్రతరం అవుతున్న క్రమంలో ఆదే రీతిలో మినరల్ వాటర్ దందా ఊపందుకుంటోంది. గిరాకీ పెరుగుతుండటంతో సండేద్లో సడేమియాలో జనరల్ వాటర్‌నే మినరల్ వాటర్‌గా సరఫరా చేస్తుండటంతో ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారు. ఈ దందాపై సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వాటర్ ప్లాంట్లపై దృష్టి సారించి ఆరోగ్యాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.