షీ టీమ్ లకు టూ వీలర్స్
నిజామాబాద్, మార్చి 24
కమీషనరేట్‌లోని ‘షీ’ టీమ్‌లకు చెందిన పోలీసులు గస్తీ నిర్వహించేందుకు ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. హీరో మోటోకార్ప్ కంపెనీ అందజేస్తున్న ఈ వాహనాల తాళాలను ఆ సంస్థ రీజీనల్ మేనేజర్ కమల్‌కరమ్ చందాని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని దివంగత జాన్‌విల్సన్ స్మారక ఓపెన్ ఏయిర్ థియేటర్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీపీ కమలాసన్‌రెడ్డికి అందజేశారు. షీ టీమ్ పోలీసుల సౌకర్యార్థం హీరో కంపెనీ 20 వాహనాలను అందించి ప్రోత్సాహం అందించడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు. అలాగే నేరాల చేదన, నియంత్రణకు దోహదపడే సీసీ కెమెరాల ఏర్పాటుకు కంపెనీ యాజమాన్యం తమవంతు సహకారం అందించేందుకు ప్రయత్నించాలని కోరారు. రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీసులకు ప్రోత్సాహం అందించడం వల్ల వారిలో మనోధైర్యం పెరుగుతుందన్నారు. కమీషనరేట్ పరిధిలోని షీ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, షీ బృందాల పనితీరుతో మహిళల్లో భద్రత పట్ల నమ్మకం ఏర్పడిందన్నారు. కమీషనరేట్ వ్యాప్తంగా 14 షీ బృందాలు పనిచేస్తున్నాయని, మహిళలు, విద్యార్థినులపై ఈవ్‌టీజింగ్, లైంగిక వేధింపులకు పాల్పడిన 250కిపైగా పోకీరీలను పట్టుకోవడం జరిగిందన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న కొన్ని సంఘటనల్లో కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. షీ టీమ్ పోలీసులు మప్టీలో సంచరిస్తూ పోకీరీలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సాక్ష్యాధారాలతో పట్టుకోవడం జరుగుతుందన్నారు. ఈవ్‌టీజింగ్, లైంగిక వేధింపులు జరిగే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో నిఘాను తీవ్రతరం చేశామన్నారు. హీరో మోటోకార్ప్ సంస్థ రీజినల్ మేనేజర్ కమల్ కరమ్ చందాని మాట్లాడుతూ పోలీసుశాఖకు తమవంతు సహకారం, ప్రోత్సాహం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పోలీసుశాఖకు 750 వాహనాలను అందజేశామని, తెలంగాణలో 200 వాహనాలను అందించారు. సీసీ కెమెరాల ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం 20 ద్విచక్ర వాహనాలతో షీ టీమ్ పోలీసులు నగరంలో ర్యాలీ నిర్వహించారు.