YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

భారీగా పెరిగిన రియల్ బిజినెస్  

భారీగా పెరిగిన రియల్ బిజినెస్  

భారీగా పెరిగిన రియల్ బిజినెస్  
హైద్రాబాద్, మార్చి 24
రియల్ ఎస్టేట్ రం గంలో భాగ్యనగరం దూసుకెళ్తుంది. గతంలో ఎపుడూ లేని విధంగా క్రయవిక్రయాలు పెరిగాయి. దేశంలోని ఆరు ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ భూమ్ అయిదేళ్లలో 32 శాతం పెరిగింది. ముఖ్యంగా అత్యంత ప్రధానమైన నూతన భవనాల కనుగోలు వ్యాపారంలో ఆరు మెగాసిటీల్లో 41 శాతం తగ్గింది. హైదరాబాద్‌లో మాత్రం 32 శాతం పెరగటం నగరంలో వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పెరుగుతున్న పెట్టుబడుల, అభివృద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు. న్యూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై కోల్‌కతా నగరాల్లో నూతన నిర్మాణ భవనాల విక్రయాలపై జేఎల్‌ఎల్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఈ రియల్ భూమ్ మరింత వేగంగా వృద్ధి చెందినట్లు సర్వే పేర్కొంది. 2014 నుంచి 2017 వరకు ప్రతి సంవత్సరం గృహా నిర్మాణాల కొనుగోలులో వృద్ధి రేటు మిగతా ఆరు నగరాలలో క్షీణించే దశలో ఉన్నా, హైదరాబాద్ నగరంలో మాత్రం వృద్ధిరేటు 32 శాతం పెరుగుదల రేటు నమోదైనట్లు సర్వే వెల్లడించింది. 2014కు ముందు సుదర్ఘీ కాలం తర్వాత ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం, రాష్ట్రం ఆవిర్భావం, రాజకీయ సుస్థిరత, అభివృద్ధి వౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం చూపుతోన్న ప్రత్యేక చొరవ ఈ వృద్ధి రేటు పెరిగేందుకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక, ఎలివేటెడ్ కారిడార్లు, హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు, ఐటీ కారిడార్లు ఉన్న నానక్‌రాంగూడ, గచ్చిబౌలీ పరిసర ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనివ్వటం కూడా స్థిరాస్తి కొనుగోలు వృద్ధికి ప్రధాన కారణాలుగా సర్వే పేర్కొంది.2013-14నుంచి 2017 వరకు ఇళ్ల విక్రయాలను పరిశీలిస్తే 2014లో ఢిలీలో లక్షా 16వేల 250 ఉండగా, 2017 నాటికి అది 37వేల 600కు పడిపోయింది. అంటే 69 శాతం పడిపోయింది. ముంబైలో కూడా 2014లో 72వేల 400 వరకున్న విక్రయాల సంఖ్య 2017 నాటికి 52వేల 600లకు అంటే 27 శాతం క్షీణించింది. చెన్నైలో 45శాతం, పూణేలో 45వేల 300 నుంచి 29వేల 300లకు తగ్గింది. ఐటీ నగరంగా పేరుగాంచిన బెంగుళూరులో 2014లో 59వేల 600వరకున్న ఇళ్ల విక్రయాలు, 2017నాటికి 49వేల 200లకు తగ్గింది. కోల్‌కత్తాలోని 12 శాతం తగ్గిపోయింది. వ్యాపార దృష్టిలో అత్యధికంగా ప్రవాసభారతీయులు ఇళ్లను కొనుగోలు చేసే పూణేలో ఇళ్ల కొనుగోలు గణనీయంగా తగ్గింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తు ఆధారిత పన్ను(జీఎస్‌టీ)తో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో తీవ్ర ప్రభావం చూపిన రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ నగరంపై మాత్రం స్వల్పంగానే ప్రభావాన్ని చూపింది. నగరం చుట్టూ కొత్త జిల్లాలుగా ఏర్పడిన రంగారెడ్డి, యదాద్రి, భవనగిరి, వికారాబాద్‌ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేయటంతో ఇళ్ల క్రయ విక్రయాల్లో గణనీమైన పురోగతి చోటుచేసుకుందని సర్వే వెల్లడించింది. ఈ వృద్ధి రేటు మున్ముందు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని సర్వే స్పష్టం చేసింది

Related Posts