తెలంగాణలో మరో మూడు కరోనా కేసులు
హైదరాబాద్, మార్చి 24
తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. లండన్ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, జర్మనీ నుంచి వచ్చిన చందానగర్‌కు చెందిన 39 ఏళ్ల వివాహితకు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన బేగంపేటకు చెందిన 61 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్టుగా తెలిపింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కు చేరింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణలో మార్చి 31వరకు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ అమలు, కరోనా వ్యాప్తి నిరోధ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వైద్యారోగ్య శాఖ, పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖతో పాటు తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మరోవైపు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 492 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.