పోలీసుల అతి ప్రవర్తనను అదుపు చేయండి
- డీజీపీకి టీయూడబ్ల్యూజే ఫిర్యాదు
హైదరాబాద్, మార్చి 24
కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు జరుగుతున్న కృషిలో భాగస్వాములవుతూ, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యతల్లో ఉన్న జర్నలిస్టులపై అతిగా ప్రవర్తిస్తున్న పోలీసులపై చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ కోరారు.ఆంధ్రజ్యోతి పొలిటికల్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ పై నిన్న రాత్రి పోలీసులు దాడికి పాల్పడడం, అసభ్యకర పదజాలంతో దూషించిన సంఘటనపై ఆంధ్రజ్యోతి ప్రతినిధులతో కలిసి విరాహత్ అలీ ఇవ్వాళ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. నిన్న మెండు శ్రీనివాస్ సంఘటనతో పాటు నగరంలో మరో ఐదు చోట్ల జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు జరిగినట్లు ఆయన డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. రామంతాపూర్ వద్ద మెండు సీనియర్ పాత్రికేయులు మెండు శ్రీనివాస్ పై అతిగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఆయా పత్రికలు, ఛానళ్లలో పనిచేసే జర్నలిస్టుల వద్ద మాత్రమే అక్రెడిటేషన్ కార్డు లుంటాయని, ఇతరత్రా విభాగాల్లో పనిచేసే జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఉండవని, ఇందుకుగానూ వారికి పోలీసుల నుండే గుర్తింపు కార్డులు జారీ చేయాలని విరాహత్ కోరారు. డీజీపీని కలిసిన వారిలో ఆంధ్రజ్యోతి నెట్ వర్క్ ఇంచార్జ్ క్రిష్ణ ప్రసాద్, స్టేట్ బ్యూరో చీఫ్ సురేష్, పొలిటికల్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్, సిటీ బ్యూరో చీఫ్ మురళీధర్, టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.యాదగిరి, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం నాయకులు రాములు, హెచ్.యు.జే నాయకులు శ్యామ్, నాగరాజు గుప్తలు వున్నారు.