తెలంగాణలో మొన్న చప్పట్లు కొట్టారు.. నేడు ఇళ్ల నుంచి తరిమేస్తున్నారు..?
వరంగల్, మార్చి 24, (న్యూస్ పల్స్)
కరోనా వైరస్ కలవరం రేపుతున్న సందర్భంలో అహర్నిశలూ శ్రమిస్తూ వైద్య సేవలందిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి కృతజతలు తెలుపుతూ ‘జనతా కర్ఫ్యూ’ రోజు చప్పట్లు కొట్టి పట్టుమని రెండు రోజులు కాలేదు. అప్పుడే.. వైద్యులపై చూపింది ఉత్తుత్తి అభిమానమేనని తేల్చి చెప్పిన ఘటన ఇది. కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న వైద్యుల పట్ల ప్రజల్లో ఎలాంటి భావన ఉందో ఈ ఉదంతం చెప్పకనే చెప్పింది. వరంగల్ జిల్లాలో కరోనా బారిన పడ్డ వారిని, కరోనా అనుమానితులను ఎంజీఎం ఆసుపత్రిలో ఉంచి చికిత్సనందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి ఇప్పుడో కష్టమొచ్చింది. ఎంజీఎంలో విధులు నిర్వహించే వైద్యులు, వైద్య సిబ్బందిలో మెజార్టీ వైద్యులు వరంగల్‌లో అద్దెకుంటూ విధులకు హాజరవుతుంటారు. అయితే.. ఈ వైద్యులను ఇళ్లు ఖాళీ చేయాలని ఇళ్ల యజమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఆ వైద్యుల వల్ల తమ ప్రాంతంలో కరోనా వ్యాప్తి చెందుతుందని, అందుకే ఖాళీ చేయమంటున్నామని వాదిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు చూసుకోవడానికి కూడా ఎంజీఎంలో పనిచేసేవారికి అద్దెకిచ్చేందుకు ఇంటి యజమానులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. మరికొందరు యజమానులు మరో అడుగు ముందుకేసి అద్దెకుంటున్న వారి సామాన్లను బయటపడేస్తున్నారు. మొన్న చప్పట్లు కొట్టిన జనం.. నేడు ఇలా గెంటేస్తున్నారంటూ గూడు కోల్పోయి వీధిన పడ్డ వైద్యులు వాపోతున్నారు.