ఎవ్వరికి పట్టని ప్రజారోగ్యం
కర్నూలు, మార్చి 26
కర్నూలు నగరంలో పరిశుభ్రత అధ్వానంగా ఉంది. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నగరపాలక సంస్థ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఆ శాఖ చేపట్టాల్సిన పారిశుధ్య పనులపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా భయం వల్ల రానున్న నెల రోజులు అత్యంత కీలకమైనదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త వహించాలని, బ్లీచింగ్ చల్లించాలని ప్రచారం చేస్తుండగా కర్నూలు నగర పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నగరంలోని పలు కూడళ్లు, వీధులు మురికి కూపాలుగా దర్శనం ఇస్తున్నాయి.కర్నూలు నగరంలో దాదాపు 6 లక్షల మంది జనాభా ఉన్నారు. కెఎంసి పరిధిలో ప్రతి రోజూ 270 మెట్రిక్ టన్నుల చెత్త ఏర్పడుతుంది. నగరంలో 51 వార్డులు, 13 డివిజన్లు ఉన్నాయి. వీటి నుంచి ప్రతి రోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేసి ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉంది. కర్నూలు నగరంలో 437 మంది రెగ్యులర్ మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్టు పద్ధతిన 480 మంది కార్మికులు పని చేస్తున్నారు. రోజూ చెత్తను సేకరించేందుకు 10 కంపాక్టర్లు, 16 ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. నగరంలోని ప్రతి వీధిలోనూ చెత్తకుప్పలు కనిపిస్తున్నాయి. నగరంలోని రోజా వీధి, సాయిబాబా నగర్, కొత్తపేట, ఎన్‌ఆర్ పేట, బంగారు పేట, బుధవారపేట, ఓల్డు సిటీ, ఉర్దూ కళాశాల ప్రాంతాల్లో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇవే కాకుండా నగర శివారు ప్రాంతాల్లో, కల్లూరులోని పలు వార్డుల్లో కూడా చెత్తకుప్పలతో దుర్గంధం వెదజల్లుతోంది. ఇక కెసి కెనాల్ నగరంలో విస్తరించి ఉన్నంత మేరకు చెత్తను డంప్ చేస్తున్న కాలువలా కంపుకొడుతోంది.ఇటీవల సిపిఎం బృందాలు నగరంలోని బుధవారపేట, కల్లూరులోని పలు వార్డులను సందర్శించి శానిటేషన్ సమస్యలను గుర్తించాయి. పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కమిషనర్‌తో పాటు ఇతర అధికారులు వార్డుల్లో పర్యటిస్తున్నా పారిశుధ్యం విషయం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు మాస్క్‌లు, గ్లౌజ్‌లు పంపిణీ చేశారు. ఇలాంటి చర్యలు చేపడుతున్నారే కానీ ప్రధాన కూడళ్లలో పేరుకుంటున్న చెత్తను తొలగించడంలో, బ్లీచింగ్ చల్లించడం, తదితర విషయాలపై మాత్రం దృష్టి సారించడం లేదు. ప్రజలకు జాగ్రత్తలు, హెచ్చరికలతోనే సరిపెడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీకర్ సెక్షన్ కాలనీలో వాటర్ ట్యాంకుల వద్ద ఉన్న సుందరయ్య పార్కు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో మురుగునీరు ఉంది. పందులకు ఆవాసంగా తయారయి కంపుకొడుతోంది. ఈ ప్రాంతంలో నడవాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్య సమస్యలతో, అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలను శుభ్రం చేయించడంలో, చెత్త తొలగింపులో నిర్లక్ష్యం వల్ల మురుగునీరు రోడ్లపై పారుతోంది. దోమలు, ఈగలు అధికం కావడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కాలువల్లో తీసిన పూడికను అక్కడే వేయడం, ఆ వ్యర్థాన్ని తొలగించకుండా రోజుల తరబడి వదిలేయడంతో ఇళ్ల మధ్య కంపు భరించలేకున్నారు.జిల్లాలో 972 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో దాదాపు రెండేళ్లుగా పాలక వర్గాలు లేవు. ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. కరోనా దెబ్బకు స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఒకవేళ ఎన్నికలు జరిగి ఉంటే ఈ నెలాఖరుకు కొత్త పాలక వర్గాలు వచ్చేవి. నిధులు కూడా వచ్చి పారిశుధ్య పనులు, ఇతర అభివృద్ధి పనులు జరిగేవి. ప్రస్తుతం ఉన్న సమస్య వల్ల ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో చెప్పలేని స్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు పైలాట్రై, మలాథిన్ పౌడర్లు, మలాథిన్ లిక్విడ్, ఎబెట్ లిక్విడ్‌లను మూడు నెలల క్రితం పంచాయతీలకు సరఫరా చేశారు. వీటిని క్రిమి సంహారక మందులుగా గ్రామీణ ప్రాంతాల్లో పిచికారీ చేయించాల్సి ఉంది. ఇప్పటికే అవన్నీ అయిపోయాయి. మళ్లీ కొత్తవి ఇవ్వాల్సి ఉన్నా దానిపై ఉలుకు పలుకు లేదు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేసేందుకు స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా గ్రీన్ అంబాసిడర్లను జిల్లాలో 3 వేల మందికి పైగా నెలకు రూ.6 వేల వేతనంతో నియమించారు. వీరికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడంతో 50 శాతం మంది ఉద్యోగాలు మానుకున్నారు. ప్రత్యేకాధికారుల పాలనలో కనీస పారిశుధ్య చర్యలపై పర్యవేక్షణ కొరవడిందని ప్రజలు విమర్శిస్తున్నారు.