ఆన్ లైన్ కేంద్రాల్లో అవినీతికి పారదర్శకత
తిరుపతి, మార్చి 27
రవాణాశాఖలో ఎలాంటి సేవలకైనా రవాణా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడ ఆన్‌లైన్ ద్వారా పొందడానికి సాధారణ సేవా కేంద్రాలకు అనుమతి ఇచ్చింది. నిర్వహకుల అవగాహన లేమి.. దస్త్రాల సమర్పణలో అవినీతి.. అధిక రుసుం వసూళ్లతో లక్ష్యం నీరుగారుతోంది.. రవాణాశాఖ పారదర్శకత పేరుతో సేవలను ఆన్‌లైన్‌లో ప్రవేశపెట్టి చేతులు దులుపుకుంది.. బాధ్యతలు చేపట్టిన సాధారణ సేవా కేంద్ర నిర్వాహకుల నిర్లక్ష్యం అడుగడుగునా తేటతెల్లమవుతోంది.. ఫలితంగా నిత్యం పలు పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అవస్థలు పడుతున్నారు.సీఈసీలను నిర్వహించే విలేజ్ లెవెల్ ఎంటర్‌ప్రైనర్ల ఎంపిక తీరు సరిగా లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా మీసేవ కేంద్రాల తరహాలో సీఈసీలను ఎంపిక చేస్తుంది. ఏ గ్రామానికి అనుమతి కోరుతున్నారో.. అక్కడ ఆధార్‌కార్డు ఉంటే చాలు. ఇక రెండు మూడు కంప్యూటర్లు, ప్రింటరు, అంతర్జాల కనెక్షన్ ఉండాలి. కంప్యూటర్‌పై కొంతమేర అవగాహన ఉండి దరఖాస్తు చేసుకుంటే.. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం జియో ట్యాగింగ్‌తో ఆ ప్రాంతాన్ని గుర్తించి యాప్ కనెక్షన్‌కు అనుమతి ఇచ్చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఎలాంటి సేవలు.. ప్రజలకు అందించాలనే విషయంలో మాత్రం కనీస అవగాహన కల్పించలేకపోయారు. ఏ సేవలు అవసరమో కంప్యూటర్‌లో కోడ్ చేస్తే అక్కడ సూచించిన వాటిని మాత్రమే జత పరుస్తున్నారు. అవగాహన లేమితో నిర్వాహకులు చేసే తప్పిదాల వల్ల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. సీఈసీ కేంద్రాలు ఇచ్చే రసీదును తీసుకుని రవాణాశాఖ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతోంది. ఇలా మళ్లీ మరో కేంద్రానికి వెళ్లి ప్రయత్నం చేయాల్సిన దుస్థితి ప్రజలకు ఎదురవుతోంది.ఈ కేంద్రాల నిర్వహణ నిమిత్తం జిల్లాలో ఓ మేనేజరును నియమించారు.ఈ జిల్లాలో ఎన్ని సీఎస్‌సీలు ఉన్నాయనే విషయం కూడా తెలియడం లేదు. సుమారు 700 కేంద్రాలు ఉన్నాయని.. వాటిపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని అంటున్నారు.సీఎస్‌ఈ సెంటర్ల అవినీతి ఏదశకు చేరిందంటే.. పలు సేవలకు వాహనదారుడి రక్తగ్రూపు నిర్ధరించే ధ్రువపత్రాలు జతచేయాల్సి ఉంటుంది. ఆ ధ్రువపత్రాలను కూడా డాక్టర్ల పేరిట నకిలీ ముద్రణలు తయారుచేసి అందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సమీపంలోని ప్రభుత్వ డాక్టర్లతో ఒప్పందాలు చేసుకుని ప్రజల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏ సేవకు ఎంత తీసుకోవాలో ఆన్‌లైన్‌లో పొందుపరిచినప్పటికీ అధిక నగదు తీసుకుంటున్నట్లు సమాచారం. ఫలితంగా అటు అవగాహన లేక.. ఇటు అధిక మొత్తంలో దోపిడీకి గురవుతూ ప్రజలు పడుతున్న ఇక్కట్లు చెప్పనలవికావు. ఇలా అడుగడుగునా దోపిడీయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారీ కేంద్ర నిర్వహకులు