కరోనా వార్డుల్లో పనిచేయలేం...
హైద్రాబాద్, మార్చి 27
కరోనా వైరస్ భయంతో గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది స్వచ్ఛందంగా సెలవులపై వెళ్తున్నారు. అందులో పని చేస్తున్న నర్సులు, ఆయాలు, సెక్యూరిటీ గార్డులు కరోనా వార్డులో పనిచేయలేమంటూ తేల్చి చెప్తున్నారు. ఐసోలేషన్ వార్డులో కరోనా రోగులకు 24 గంటలూ సేవలందిస్తున్నామని, కానీ తమ జాగ్రత్తలను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగులకు సేవలు చేసి.. ఇంటికెళ్లి భర్త, పిల్లలను కలిసేందుకు భయం వేస్తోందని చెప్పారు. ఇంటి నుంచి బయటికొస్తే కాలనీవాసులకు భయపడాల్సి వస్తోందని వెల్లడించారు. ఆస్పత్రిలో నర్సులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు నర్సులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్‌కు గురువారం లిఖిత పూర్వకంగా సమర్పించారు.అంతేకాక, విధులు నిర్వర్తించాక, తమ భర్తలు తమను బైక్‌లపై తీసుకెళ్తున్నారని దీనిపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆవేదన చెందారు. తమ భర్తలకు రవా ణా పాసులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, వీరిని గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఉన్న ఓ పాత భవనంలో ఉండాలని ఆదేశించారని, కానీ పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి ఇవ్వాలని ఆస్పత్రి సిబ్బంది కోరుతున్నారు. అప్పుడే కరోనా రోగులకు సేవలు చేస్తూ ఇంటికెళ్లకుండా ఈ క్వార్టర్‌లోనే ఉంటామని వారు చెప్తున్నారు.రోజూ కరోనా వైరస్ వార్డులో సేవలు చేయలేకపోతున్నామని, ప్రమాదకరమైన వార్డులో రెండు రోజులకోసారీ నర్సుల డ్యూటీలు మార్చితే బాగుంటుందని సిబ్బంది కోరుతున్నా రు. గాంధీలో విధులు నిర్వహిస్తున్న తమకు సెలవులు ఇవ్వాలని ఆస్పత్రిలో పనిచేస్తున్న సీనియర్ నర్సులు కోరుతున్నారు. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా తమ ఆరోగ్యంపై భయంగా ఉంటోందని అన్నారు. తాము కూడా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.