రాష్ట్రంలో 700 ఐసీయూలు.. 190 వెంటిలేటర్లు
మంత్రి ఈటల
హైదరాబాద్ మార్చి 27
రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ వైద్య సదుపాయాలు ఉన్నాయని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఆయన కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వైద్య శాఖ అధికారులు, వైద్య కళాశాలల ప్రతినిధులో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ప్రైవేటు వైద్య కళాశాలలను ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంది. మొదట ప్రభుత్వ ఆస్పత్రులను వాడుకొనేలా చర్యలు తీసుకుంటాం. రెండో దశలో వాడుకొనేందుకు ప్రైవేటు వైద్య కళాశాలలను అనుమతి కోరాం. బాధితుల కోసం 10వేల పడకలు సిద్ధంగా ఉన్నట్లు వారు చెప్పారు. అలాగే, రాష్ట్రంలో 700 ఐసీయూలు, 190 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 26 రోజుల్లో మొత్తం 47 కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో ఏ ఒక్కరూ విషమ పరిస్థితుల్లో లేరు. వారికి ఇతరత్రా సమస్యలూ లేవు. దేశం అబ్బురపడేలా అన్ని రకాలుగా పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నాం. ప్రజలకు భద్రత, ధైర్యం కల్పించడానికి ప్రభుత్వం వెనుకాడదు’’ అని ఈటల తెలిపారు.