ఏపీలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
అమరావతి మార్చి 27
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఈ భేటీలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు. ఇప్పటి వరకు ఏపీలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. రాష్ట్రానికి 28 వేల మంది విదేశాల నుంచి వచ్చారని, ప్రతి నియోజకవర్గంలో 100 పడకలను సిద్ధం చేశామన్నారు. జిల్లాల్లో 200 పడకలను ఏర్పాటు చేశామని, విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో కరోనా ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. వైద్యులు, సిబ్బందికి ఎన్-95 మాస్క్‌లను ఇచ్చామని మంత్రి పేర్నినాని తెలిపారు. 10 లక్షల సర్జికల్ మాస్క్‌లను అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో సరుకుల రవాణా వాహనాలను అనుమతిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా సామాజిక దూరం పాటించాలని పిలుపు ఇచ్చారు. అందుబాటులో శానిటైజర్స్ లేకపోయినా సబ్బుతో చేతులు కడుక్కోవాలని మంత్రి పేర్నినాని సూచించారు. ఆక్వా ఎగుమతిదారులతో శనివారం అత్యవసర సమావేశం నిర్వహిస్తామని మంత్రి పేర్నినాని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఉన్నవారు అక్కడే ఉండిపోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల సీఎంలతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలిపారు. కరోనా వైరస్‌ను కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి పేర్నినాని మండిపడ్డారు.