బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం
అమరావతి మార్చి 27
వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో 3 నెలలకు సంబంధించిన బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోంది. దాదాపు 28వేల మంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారు. 104 హెల్ప్‌లైన్ నెంబరు ఏర్పాటు చేశాం... 24గంటలు పనిచేస్తుంది. కరోనా బాధితుల కోసం ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్ బెడ్స్ ఏర్పాటు చేశాం. జిల్లా స్థాయిలో 200 పడకల ఆసుపత్రిని సిద్దంగా ఉంచాం. కరోనా వ్యాపించకుండా స్వీయనింత్రణ విధించుకున్నాం. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరులోని ఆసుపత్రుల్లో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్నాం. 52వేల ఎన్-95 మాస్క్‌లు, 4వేల పీపీఈలు, 400 వెంటిలేటర్లు, 10లక్షల సర్జికల్ మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి’’ అని మంత్రి వివరించారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు. క్వారంటైన్‌కు సిద్ధమైతేనే రండి.. చేతులెత్తి మొక్కుతున్నా.. 14రోజుల క్వారంటైన్‌కు సిద్ధమైతేనే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రాష్ట్రంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించి సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం సృష్టించొద్దని ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఏపీ ప్రజలను కోరారు. ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని.. ఇక్కడి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని కోరారు. పొరుగురాష్ట్రాల ప్రభుత్వాలతో సీఎం జగన్, సీఎస్ నీలం సాహ్ని మాట్లాడారని, వారిని అన్ని విధాలా అదుకుంటామని అక్కడి ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్లు ప్రభుత్వ నిస్సహాయతను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణకు జిల్లా, నియోజకవర్గాల వారీగా టాస్క్‌ఫోర్స్ లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉపాధిహామీ, వ్యవసాయ కూలీలు కూడా సామాజిక దూరం పాటించాని మంత్రి సూచించారు. రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయుల సంఖ్యపై విపక్షాల విమర్శలు సరికాదన్నారు. ఈనెల 10న సేకరించిన వివరాల ద్వారా 13వేల మంది అని చెప్పాం, రెండో విడత సర్వేలో 28వేల మంది రాష్ట్రంలోకి వచ్చారని తేలిందని వివరించారు.