YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 కోడిని కాటేసిన కరోనా.

 కోడిని కాటేసిన కరోనా.

 కోడిని కాటేసిన కరోనా.
గుంటూరు, మార్చి 27 (న్యూస్ పల్స్): కరోనా మహమ్మారి పౌల్ట్రీ పరిశ్రమను దారుణంగా దెబ్బ తీస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో కోళ్లను మేపలేక ఎంతోకొంతకు తెగనమ్ముకుంటున్నారు. బ్రాయిలర్‌ రైతులు కొత్తగా బ్యాచులు వేయకుండా ఆగిపోతున్నారు. లేయర్‌ రైతులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపకపోవడంతో కోడి పిల్లలను ఉత్పత్తి చేసే హేచరీల్లో కార్యకలాపాలు మందగించాయి. మొత్తం మీద బ్రాయిలర్‌ కోళ్ల పెంపకం దాదాపు 80 శాతానికి పైగా పడిపోయింది. కోట్ల సంఖ్యలో కోడిపిల్లల ఉత్పత్తిని నిలిపివేసి గుడ్లను నామమాత్రపు ధరకు విక్రయించాల్సిన దుస్థితి దాపురించింది. కోళ్ల పరిశ్రమ లావాదేవీలు  దేశీయంగా జరుగుతాయి తప్పా అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన వ్యవహారం కాదు.  అయినా కరోనా వ్యాధి గురించి జరుగుతున్న ప్రచారం కారణంగా కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు విలవిలలాడిపోతున్నారు. కొక్కెర, బర్డ్‌ప్లూ వంటి ప్రమాదకర రోగాలు వచ్చినప్పుడు సైతం ఇంతటి నష్టాలు చవిచూడలేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఫిబ్రవరి మాసం ప్రారంభం నుంచి మొదలైన ఈ కలకలం క్రమంగా విస్తరించడంతో రూ.వందల కోట్లు గాల్లో కలిసిపోతున్నాయి. సున్నితమైన అంశంగా భావించి విదేశాలు తీసుకుంటున్న పలురకాల జాగ్రత్తలు క్రమంగా మన దేశంలోనూ పెరుగుతున్నాయి. దీంతో కోడి మాంసం, కోడిగుడ్ల వినియోగం దారుణంగా పడిపోయింది. ఏడాది కాలంగా నష్టాల్లో కొనసాగుతున్న కోళ్ల పరిశ్రమకు వేసవికాలం కాస్తంత ఉపశమనం ఇస్తుందన్న రైతుల ఆశలపై కరోనా రాక్షసి కోరలు చాచింది. ప్రజల్లో నెలకొంటున్న భయం, అభద్రతాభావం కారణంగా రోజురోజుకు వినియోగం క్షీణిస్తోంది. ఈనేపథ్యంలో కోళ్లను వదిలించుకోవడానికి పెంపకందారులు నానాతంటాలు పడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఉచితంగా కోళ్లను ఇచ్చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.  పౌల్ట్రీ రంగం దెబ్బతినడంతో కోళ్లమేతకు ఉపయోగించే మొక్కజొన్న, జొన్న తవుడు, నూకలపై ఈప్రభావం పడుతోంది. గతేడాది క్వింటాల్‌ మొక్కజొన్నలు రూ.2వేలపైగా అమ్మగా ప్రస్తుతం క్వింటా రూ.1400లకు పరిమితమైంది. కొద్దిరోజుల్లో పంట పూర్తిస్థాయిలో మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో ధర మరింత క్షీణిస్తుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కొందరు కోళ్ల రైతులు మొక్కజొన్న, జొన్న తదితర దాణా తయారీ సరకులను కొనుగోలు చేసి గరిష్ఠంగా 2నెలల పాటు నిల్వ చేసుకునేవారు. అయితే ఈఏడాది ఈపరిస్థితి కనిపించడం లేదు. నష్టాల కారణంగా చాలామంది పెంపకందారులు బ్యాంకులకు పెద్దఎత్తున బకాయి పడుతున్నారు. సకాలంలో రుణ వాయిదాలు చెల్లించలేక ఎన్‌పీఏగా మారనున్నారు. ఈనేపథ్యంలో బ్యాంకు రుణాల నుంచి ఏడాదిపాటు మారటోరియం విధించాలని వారు కోరుతున్నారు.  గత 30-40 సంవత్సరాల్లో చికెన్‌ అమ్మకం ధరలు ఇంత ఘోరంగా పడిపోలేదని వ్యాపారులు చెబుతున్నారు. కొక్కెర, బర్డ్‌ప్లూ వంటి వణికించే వ్యాధులు వచ్చినప్పుడు కూడా కిలో చికెన్‌ రూ.70 వరకు విక్రయించిన దాఖలాలను వారు గుర్తుచేసుకున్నారు. గుంటూరులో అత్యంత కనిష్ఠంగా కిలో రూ.30 అమ్మడం, చరిత్రలో ఎప్పుడూ జరగలేదని వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి తీవ్రత నష్టం కలిగించే వాస్తవిక పరిస్థితి కన్నా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రతికూల ప్రచారం నష్టదాయకంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు.  
 

Related Posts