భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీని బాగా ఆరాధిస్తానని, అతను మ్యాచ్ ముగించే విధానం తనకు ఎంతో ఇష్టమని అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న అభిషేక్ శర్మఅంటున్నాడు.. ప్రస్తుతం ప్రపంచకప్ కోసం భారత అండర్-19 జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్‌పై గురిపెట్టిన టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో ఆ దిశగానే ముందుకు సాగుతోంది. జట్టులో సభ్యుడైన 17 ఏళ్ల అభిషేక్ శర్మ మాట్లాడుతూ..‘సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ నా అభిమాన క్రికెటర్లు. వారే నా స్ఫూర్తి. ధోనీ గొప్ప మ్యాచ్ ఫినిషర్ అని అందరికీ తెలుసు. అతన్ని నేను ఆరాధిస్తాను. అతను మ్యాచ్ ముగించే విధానం నాకు ఎంతో నచ్చుతుంది. అతని మ్యాచ్ ఫినిషింగ్ స్కిల్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది’ అని తెలిపాడు. అనంతరం టోర్నీ గురించి ‘ప్రపంచకప్ టోర్నీకి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాం. ప్రతి జట్టును ఫోకస్ చేశాం. ఏ జట్టును తక్కువగా అంచనా వేయడం లేదు. కోచ్ ద్రవిడ్ జట్టును ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచకప్ గెలవడం ప్రస్తుతం మా జట్టు లక్ష్యం’ అని శర్మ వివరించాడు.