ఘనంగా ముగిసిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం
తిరుమల మార్చ్ 28
విశ్వమానవ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ, శ్రీవారి ఆశీస్సులు కోరుతూ కరోనా కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో మార్చి 26వ తేదీ నుండి నిర్వహించిన శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం శనివారం మహా పూర్ణాహుతిలో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు మాట్లాడుతూ ఈ యాగంలో ప్రధానంగా ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ ధన్వంతరి స్వామిని ఆరాధన చేసి హోమాలు, మంత్ర పూరితమైన వాయువులను సమస్త ప్రపంచానికి సూర్య మండలం ద్వారా అందించినట్లు తెలిపారు. మంత్ర పఠనాన్ని శ్రవణం చేసే అవకాశాన్ని వేదంలో కలిగించినట్లు తెలిపారు.
సమస్త ప్రపంచంలోని వనాలు, ఔషదాలు, చెట్లు తదితరాలు అంతా ధన్వంతరి స్వరూపాలన్నారు. కరోనా వంటి కంటికి కనపడని విపత్తు ప్రబలినప్పుడు ఈ యాగం ద్వారా అన్ని వ్యాధుల నుండి ఉపసమనం కలుగుతుందన్నారు. ఇందులో ప్రపంచంలోని జీవరాశులను కాపాడటానికి 24 కళశాలలో 24 మంది దేవతలను మంత్ర బంధనంతో ఆవాహనం చేసి జప హోమాలు నిర్వహించినట్లు వివరించారు. ప్రజలు ధన్వంతరి మహా మంత్రాన్ని జపించడం వలన సమస్త వ్యాధులు నయం అవుతాయన్నారు.