పార్లమెంటు సభ్యుడిగా అడుగు పెట్టే ముందు ప్రధాని మోడీ మెట్లకు నమస్కరించారు. ఇప్పుడు సిఎం చంద్రబాబునాయుడు అదే పని చేశారు. ఏపీకి న్యాయం చేసేందుకు తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని, ఇందుకు మద్దతునివ్వాలని విపక్షాలను కోరారు బాబు. కాకపోతే ఇందులో సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంటు మెట్లకు నమస్కారం పెట్టడం, కెమెరామన్ లకు అనుగుణంగా కొద్ది సేపు వంగి ఉండడం విశేషం.
చంద్రబాబు పార్లమెంటు ఆవవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద, పార్లమెంటు ప్రధాన ద్వారం మెట్లు వద్ద ఫొటోగ్రాఫర్ల సూచనలకు అనుగుణంగా చంద్రబాబు కదిలారు. మెట్లను చేతులతో తాకిన చంద్రబాబు ఫొటో తీయలేదు కొందరు ఫొటోగ్రాఫర్లు. సార్ మరోసారి అనగానే బాబు వారి సూచనలకు అనుగుణంగా అదే పని చేశారు. ఇలా ఒకసారి కాదు మూడు, నాలుగు సార్లుచేయడం ఫొటో కోసమే అన్న చర్చ సాగుతోంది. పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి దూరం నుంచే నమస్కారం చేశారు చంద్రబాబు. ఆ సమయంలోను ఫోటో గ్రాఫర్ల సూచనలతో రెండు, మూడు సార్లు గాంధీ విగ్రహాన్ని తాకారు. పార్లమెంటుకు వచ్చిన చంద్రబాబు వివిధ పార్టీల నేతలతో భేటీ అయ్యారు. అయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ తో భేటీ అయ్యారు. విభజన హామీల అమలులో కేంద్రం వైఖరిని ఆయనకు వివరించారు. ఏపీకి న్యాయం కోసం తాము చేస్తున్న పోరటంలో సహకరించి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు.తరువాత చంద్రబాబు బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మురళీమనోహర్ జోషి తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీకి కేంద్రంలోని మోడీ సర్కార్ చేసిన అన్యాయం గురించి వివరించారు. మిత్రపక్షంగా ఉన్నా ఏపీకి విభజన హామీల అమలులో కేంద్రం దారుణంగా వ్యవహరించిందని వివరించారు. విభజన హామీలపై రూపొందించిన నివేదికను ఆయనకు అందజేశారు. ఏపీకి న్యాయం కోసమే తాము ఎన్డీయేలో నుంచి బయటకు వచ్చి పోరుబాట పట్టామని చంద్రబాబు మురళీమనోహర్ జోషికి చెప్పారు.
రోజులానే ఇవాళ కూడ పార్లమెంటులో చర్చ లేకుండానే సభ వాయిదా పడింది. పది రోజులుగా ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరిగింది. చంద్రబాబు పార్లమెంటుకు రావడం ఇదేం కొత్త కాదు.చాలా సార్లు సభా ఆవరణలోకి వచ్చారు. కానీ ఈ సారి టీడీపీ ఎంపీలు ఆయనతో పాటు.. తోడుగా రావడం నేతలను పిలవడంతో సందడి వాతావరణ నెలకుంది. మరోవైపు ఏపీకి హోదా, ప్యాకేజి, వివిధ పనుల పైనా వివిధ పార్టీల జాతీయ నేతలు చంద్రబాబుతో చర్చించడం విశేషం.