కరోనా పేరుతో దోపిడీ (అనంతపురం)
అనంతపురం, మార్చి 30 కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నా.. సాధారణ రుగ్మతలు తలెత్తినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులతో పరీక్షలు.. వైద్య చికిత్స లభిస్తోంది. తాజాగా.. కరోనా నియంత్రణ కోసం ఆగమేఘాలపై అధునాతన సౌకర్యాలతో ప్రత్యేక పడకలు, విభాగాలను కూడా నెలకొల్పారు. ఏ జబ్బు లక్షణాలు ఉన్నా చికిత్స చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన తరుణమిది. అసలే మండే ఎండలు.. వెన్నంటే వాతావరణ మార్పులు. ఆపై... కలవరపెడుతున్న ‘కరోనా’. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. సందట్లో సడేమియా అన్న చందంగా క్లినిక్‌లు నిర్వహిస్తున్న కొద్దిమంది వైద్యులు సైతం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడే చక్కదిద్దుకోవాలనే రీతిలో మరికొన్ని డయాగ్నొస్టిక్ కేంద్రాలు, ల్యాబ్‌లు సైతం అక్రమార్జనకు గేట్లు తెరిచాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ లక్షణాలు ఉన్నా... కరోనా అనుమానిత లక్షణాలేమో అని చెప్పకనే చెబుతూ డైలమాలో పడేస్తున్నాయి. ఇదే రీతిన ఆదాయానికి బాటలు వేస్తున్నాయి. అసలే కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అందులోనూ... చేయించుకుంటే మీకే మంచిదని.. వైద్యులు పేర్కొనడంతో ఏమి చెప్పినా వినక తప్పదనే పరిస్థితి నెలకొంది. ప్రాథమిక వ్యాధి నిర్ధరణ పరీక్షల పేరుతో సంబంధం లేని రక్త, మూత్ర పరీక్షలు రాస్తున్నారు. అంతేకాదు... అల్ట్రాసౌండ్ స్కానింగ్, గొంతు స్కానింగ్ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. సాధారణ మందులతో నయమయ్యే అవకాశం ఉన్నా ఖరీదైన యాంటీబయాటిక్ మందులు కూడా రాస్తున్నారు. అటు ల్యాబ్, ఇటు ఔషధ దుకాణాల నుంచి వచ్చే కమీషన్‌కు ఆశ పడుతున్నారు. కొద్దిమంది ఈ తరహా దోపిడీకి తెర లేపడం గమనార్హం. జిల్లాలో ఇప్పటి దాకా ఒక్క ‘కరోనా’ వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఓ ముగ్గురికి మాత్రమే అనుమానిత లక్షణాల పేరుతో వ్యాధి నిర్ధరణ చేశారు. వీరికి కూడా ఏమీ లేదు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్ఫి.. ఇవి కరోనా ప్రాథమిక లక్షణాలు. ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ఈ తరహా లక్షణాలు రావడం సహజమే. ఇప్పుడు పల్లెల్లో, మురికివాడ ప్రాంతాల్లో కీళ్లనొప్పులతో కూడిన జ్వరం, దగ్గు, జలుబు కేసులు ఉన్నాయి. ఇలాంటి వాటితో సతమతమయ్యే విద్యావంతులకు మాత్రం కరోనా ఆలోచన పట్టుకుంది. వీరి ఆందోళనే కొందరు వైద్యులకు ఆదాయంగా మారింది. అనంత నగరంలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబొరేటరీలు, డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో కాసింత వెనకేయడమే లక్ష్యంగా సాగుతున్నారు. అనంత నగరం, హిందూపురం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి, ధర్మవరం, రాయదుర్గం.. ప్రధాన పట్టణాల్లో ఆస్పత్రులకు వెళ్లే రోగుల సంఖ్య పెరిగింది. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, గన్యా.. వంటి జ్వరాలకు రక్త పరీక్షలు చేస్తున్నారు. లిపిడ్, లివర్ ప్రొఫైల్, ప్లేట్‌లేట్ కౌంట్, గ్రూపింగ్, హెచ్‌బీ.. వంటి అతి సాధారణ పరీక్షలు సైతం చేయిస్తున్నారు. కొందరికైతే ఎంఆర్‌ఐ, సీటీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లు కూడా రాస్తుండటం గమనార్హం.