YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

వీరికేదీ రక్షణ..

వీరికేదీ రక్షణ..

వీరికేదీ రక్షణ..? (ఖమ్మం)
ఖమ్మం, మార్చి 30 (న్యూస్ పల్స్): నగరాలు, పట్టణాల్లో లక్షల మంది ఆరోగ్యాలకు బాసటగా నిలుస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీవితాలకు రక్షణ లేకుండా పోయింది. పాలకవర్గాల ఉదాసీనత, అవగాహన లోపం అనారోగ్యాలకు హేతువులవుతున్నాయి. కొన్ని చోట్ల సకాలంలో ఇవ్వరు.. ఇచ్చిన చోట వినియోగించరు.. ఇది చివరికి కార్మికులపైనే పెను ప్రభావం చూపుతోంది. ఉమ్మడి జిల్లాలోని నగర, పురపాలకాల్లో 1183 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. అత్యధిక శాతం రక్షణ పరికరాలు లేకుండానే పారిశుద్ధ్య పనులు చేస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. ప్రపంచాన్ని కరోనా వైరస్‌ బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో వాటి ఆవశ్యకత మరింత పెరిగింది. పారిశుద్ధ్య కార్మికులకు గ్లౌస్‌లు, బూట్లు, మాస్క్‌లు ఏటా అందిస్తారు. నిబంధనల ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు చేతులకు గ్లౌజులు, నోటికి, మూతికి కట్టుకునేందుకు మాస్క్‌లు, కాల్వల్లో దిగి పూడికతీత చేపట్టే సమయంలో కాళ్లకు గమ్‌షూ, రహదారులను శుభ్రపరిచే వారికి రేడియం స్టిక్కరింగ్‌తో కూడిన ఆఫ్రాన్లను పంపిణీ చేయాలి. వర్షాకాలంలో రెయిన్‌కోట్లను సైతం పంపిణీ చేయాల్సి ఉంది. చాలా ఏళ్ల వరకు వరకు ఈ ప్రక్రియ మొక్కుబడిగానే సాగింది. రక్షణ సామగ్రిని కేవలం శాశ్వత కార్మికులకు మాత్రమే పంపిణీ చేసేవారు. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చి ప్రజారోగ్య దృష్ట్యా కాంట్రాక్టు కార్మికులకు అందించారు. ప్రస్తుతం మాత్రం శాశ్వత కార్మికులకు మాత్రమే అందిస్తామని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటుగా నిత్యవసర వస్తువులను ఇవ్వాల్సి ఉంది. వీటిల్లో పురుషులకు రెండు జతల దుస్తులు, చెప్పులు, కొబ్బరినూనె, మంచినూనె, సబ్బులు, కండువాలు, మహిళా కార్మికులకు చీరలు, జాకెట్‌ పీసులు, కండువాలు అందిస్తారు. గ్లౌస్‌లు, మాస్క్‌లు ఇచ్చిన నెల రోజుల్లోనే దెబ్బతినడంతో వాటిని వినియోగించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. బూట్లు వేసుకొని కాలువలోకి దిగి పనిచేయడం ఇబ్బందిగా ఉందని కార్మికులు వాపోతున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని వివిధ పురపాలకాలు, నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు వీటిని అందించారు. అయితే కార్మికులెవ్వరూ వాటిని వినియోగించపోవడం గమనార్హం. ఆఫ్రాన్‌లను వినియోగిస్తున్న కార్మికులు పూర్తి రక్షణ కల్పించే మాస్క్‌లు, గ్లౌస్‌లను మాత్రం వినియోగించడం లేదు. కార్మికులంతా ఎలాంటి భద్రత పాటించకుండా పనులు చేపట్టడంతో తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రధానంగా జలుబు, దగ్గు, ఆయాసంతో పాటు శ్వాసకోశ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వీరిలో కొందరు దీర్ఘకాలిక సమస్యలతో నిత్యం ఆస్పత్రుల చుట్టే తిరుగుతున్నారు. వర్షాలు పడే సమయంలో కలుపుమొక్కలు పెరిగిన కాల్వల్లోకి దిగి పూడికలు తొలగిస్తూ.. విషపురుగుల బారిన పడిన ఘటనలు లేకపోలేదు. కార్మికులు ఏమరుపాటుగా ఉండి రక్షణ సామగ్రి ధరించకుండా విధుల్లోకి వస్తే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పారిశుద్ధ్య అధికారి, సంబంధిత జవానుపై ఉంటుంది. రక్షణ సామగ్రి లేకుండా విధుల్లోకి తీసుకోరాదన్న నిబంధన సైతం ఉంది. క్షేత్రస్థాయిలో నిబంధనకు విరుద్ధంగా పనులు చేయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కార్మికుల ఆరోగ్యం కంటే పని పూర్తి చేయడంపై దృష్టిసారించి ఇష్టానుసారంగా విధులు చేయిస్తున్నారు. ఒకవేళ పొరపాటుగా ఏదైనా ప్రమాదం జరిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించావంటూ కార్మికులనే దబాయించే యత్నం జరుగుతోంది. ఆరోగ్య రక్షణ పట్ల జవాన్‌లు, పారిశుద్ధ్య పర్యవేక్షకులు కార్మికులకు అవగాహన కల్పించి, వాటిని వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది.

Related Posts