YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మరింత చేరువగా గ్రామ పాలన!!

మరింత చేరువగా గ్రామ పాలన!!

ప్రభుత్వ చొరవతో కుమ్రం భీం జిల్లాలో కొత్తగా 162 గ్రామ పంచాయతీలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం 173 గ్రామ పంచాయతీలకు కొత్తవి కూడా తోడవడంతో గ్రామపాలన ప్రజలందరికీ చేరువకానుంది. ప్రజలూ గ్రామాభివృద్ధిలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. దీంతో జిల్లా వాసుల్లో హర్షం వెల్లువెత్తుతోంది. గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీల సంఖ్యను పెంచిన సర్కార్ నిర్ణయాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్తపాత పంచాయితీలు కలిస్తే 235కు చేరతాయి. ప్రజలకు అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యంతో పాటూ రాజకీయంగానూ అవకాశాలు మెరుగవుతాయి. కొత్త పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు గణనీయంగా అందుతాయి. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నిరోజుల క్రితం ఓ ప్రకటన కూడా చేశారు. చిన్న పంచాయతీలకు రూ.20 లక్షల వంతున నిధులిస్తామని అన్నారు. దీంతో గ్రామాల అభివృద్ధి జోరందుకోనుంది.

గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానికంగా పన్నుల రూపంలో నిధులు సమకూరుతాయి. ఈ నిధులతో గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. పంచాయతీ పరిధిలోని జనాభా తక్కువగా ఉండడం వల్ల ప్రజల్లో బాధ్యత సైతం పెరిగే అవకాశాలున్నాయి. అభివృద్ధి పనుల్లో అవకతవకలు సాగినా, నిధులు పక్కదోవ పట్టినా ప్రజలు అధికార యంత్రాంగాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే స్థానికంగా మిషన్ భగీరథ పనులు వేగవంతమయ్యాయి. దీంతో ఇంటింటికి నల్లానీరు సరఫరా కానుంది. గ్రామాల్లో తాగు నీటి సమస్య పరిష్కృతమైతే రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మెరుగైన అవకాశాలు ఏర్పడతాయి. మొత్తంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పల్లెలకు సమర్ధవంతంగా అందుతాయి. గ్రామాభివృద్ధిలో ప్రజలకూ క్రియాశీలక పాత్ర ఉంటుంది.   

Related Posts