YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

క్వారంటైన్ పేషంట్లకు జియో ట్యాగింగ్

క్వారంటైన్ పేషంట్లకు జియో ట్యాగింగ్

క్వారంటైన్ పేషంట్లకు జియో ట్యాగింగ్
హైద్రాబాద్, మార్చి 30,
 విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో వారిని హోమ్‌ క్వారంటైన్‌ చేశారు. అలాంటి వారికి విమానాశ్రయాల్లోనే స్టాంపింగ్‌ చేస్తున్నారు. నిర్ణీత గడువు ముగిసే వరకు ఇళ్లు దాటి బయటకు రావద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా కొందరు విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని పోలీసులకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారిపై పటిష్ట నిఘా కోసం సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు. దీని కోసం తెలంగాణ పోలీసు అధికారిక యాప్‌ టీఎస్‌ కాప్‌లో హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారిని జియో ట్యాగ్‌ చేయడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లివచ్చిన వారి వివరాలను పోలీసు విభాగం వివిధ మార్గాల్లో సేకరించింది. ఈ జాబితాను స్టేషన్‌ల వారీగా క్షేత్ర స్థాయి అధికారులకు అందించింది. ఈ జాబితాల్లోని వివరాల ఆధారంగా వారి ఇళ్లకు వెళ్తున్న గస్తీ సిబ్బంది చిరునామాలను సరిచూస్తున్నారు. ఆపై ఆ ఇంటిని అక్షాంశం, రేఖాంశాల ఆధారంగా జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. క్వారంటైన్‌ అయిన వ్యక్తి ఫోన్‌ నంబర్‌ను దీనికి అనుసంధానిస్తున్నారు. 22 వేల మంది వివరాలను జియో ట్యాగింగ్‌ ద్వారా టీఎస్‌ కాప్‌ యాప్‌లోని లింక్‌లో పొందుపరిచారు. ఫలితంగా ప్రతి గస్తీ సిబ్బంది, ఆకస్మికంగా తనిఖీ చేసే అధికారులు అనునిత్యం ఆ ఇళ్లను, క్వారంటైన్‌ అయిన వ్యక్తుల్ని పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. ఇలా క్వారంటైన్‌ అయిన వ్యక్తుల కదలికల్ని పోలీసు విభాగం నిరంతరం పర్యవేక్షిస్తోంది. వీరిలో ఎవరైనా తమ ఇంటిని దాటి గరిష్టంగా 50 మీటర్లు వెళితే ఆ విషయాన్ని జియో ట్యాగింగ్‌ ద్వారా పోలీసు విభాగం తక్షణం గుర్తిస్తుంది. క్వారంటైన్‌ అయిన వ్యక్తి పరిధి దాటిన విషయం పోలీసులకు టీఎస్‌ కాప్‌ యాప్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్‌ సిబ్బందికి తెలుస్తుంది. అక్కడి వారు క్షేత్రస్థాయి అధికారులకు దీనిపై సమాచారం ఇవ్వడం ద్వారా అప్రమత్తం చేస్తారు. ఆ అధికారులు గస్తీ టీమ్‌ సహకారంతో కొన్ని నిమిషాల్లోనే బయటకు వచ్చిన క్వారంటైన్‌ వ్యక్తిని గుర్తించి, ఆ ప్రాంతానికి చేరుకుని అదుపులోకి తీసుకుంటారు. వీరిపై ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.  

Related Posts