డిజిటల్ క్లాసులతో విద్యార్ధులు
హైద్రాబాద్, మార్చి 30
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలను డిజిటల్, ఇ-లెర్నింగ్ ఫ్లాట్‌ఫారమ్స్ ద్వారా చదివించుకోవాల్సిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. ఈ మేరకు తమ తమ రాష్ట్రాల్లోని విద్యార్ధులకు ఈ సమాచారం అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ఈ డిజిటల్, ఇ-లెర్నింగ్ ఫ్లాట్ ఫార్మ్ అన్నీ ఉచితంగానే లభ్యమవుతాయని స్పష్టం చేసింది.కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ(ఎంహెచ్‌ఆర్‌డి) రూపొందించిన దీక్ష, ఇ పాఠశాల వంటి ఆన్‌లైన్ వ్యవస్థలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కేంద్రం పే ర్కొంది. సిబిఎస్‌ఇ, ఎన్‌సిఇఆర్‌టి ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు రూపొందించిన 80 వేల పుస్తకాలు దీక్ష పోర్టల్‌లోనూ, ఇ పాఠశాలలో 2 వేలకుపైగా ఆడియో, వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి.దీక్ష వెబ్‌సైట్‌లో సిబిఎస్‌ఇ, ఎన్‌సిఇఆర్‌టి, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సిలబస్‌లతో కూడిన పాఠ్యపుస్తకాలు బహుళ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు 80 వేలకు పైగా ఇబుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందు కు సంబంధించిన యాప్‌ను ఐఒఎస్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంట్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఉంటే సాధారణంగా పిల్లలు రెండు మూడు రోజులపాటు పాఠశాలకు సెలవులు పెడతారు. ఆ తర్వాత స్కూల్‌కు వెళ్లమంటే మారాం చేస్తూ ఉంటారు. అలాంటిది అనుకోకుండా రోజుల తరబడి సెలవులు వస్తే గందరగోళమే. టివిలు, స్మార్ట్‌ఫోన్లు, వీడియోగేమ్‌లతో ఎంతో ప్రమాదం పొంచి ఉంటుంది. తాజా వరుస సెలవుల నేపథ్యంలో పిల్లలను గాడిన పెట్టడమంటే కత్తిమీద సవాలే. కరోనా ఆకస్మిక సెలవుల నేపథ్యంలో అప్రమత్తమైన పాఠశాలలు పిల్లలు చెడుమార్గాలు పట్టకుండా జాగ్రత్తపడుతున్నాయి. ఆన్‌లైన్ పాఠాలను ఎంచుకుని పిల్లలకు పాఠ్యాంశాలతో పాటు కొత్త విషయాలను కూడా నేర్పిస్తున్నాయి. ఈ సారి ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు చదువు పట్ల ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పాఠశాలలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.పదవ తరగతి పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటివరకు జరిపిన ప్రిపరేషన్ వృథా కాకుండా పాఠశాలలు జాగ్రత్త పడుతున్నాయి. పదవ తరగతికి సంబంధించిన పరీక్షల రీ షెడ్యూల్ వెలువడేంత వరకు విద్యార్థులు నిరంతరం ప్రిపరేషన్ కొనసాగేలా విద్యార్థులను సమాయత్తం చేస్తున్నారు. ప్రస్తుత పోటీ నేపథ్యంలో పది పరీక్షల్లో తమ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరచాలని పాఠశాలలు సహజంగా కోరుకుంటాయి. ఈ నేపథ్యంలో సంబంధిత టీచర్లు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు మార్గనిర్ధేశం చేస్తూ వారి సందేహాలను కూడా వాట్సాప్,ఫోన్ల ద్వారా నివృత్తి చేస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో విద్యార్థులు దృష్టి మరలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్థులు, టీచర్లూ ఇంట్లో ఉంటూనే అందుబాటులో ఉన్న టెక్నాలజిని అందిపుచ్చుకుంటూ పరీక్షలకు సంసిద్దమవుతున్నారు