లాక్ డౌన్ తో సగానికి తగ్గిన కాలుష్యం
న్యూఢిల్లీ, మార్చి 30
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశం 21 రోజుల లాక్ డౌన్ లోకి వెళ్లడంతో దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక ప్రధాన నగరాలు గత కొన్ని రోజులుగా కనిష్ట వాయు కాలుష్యాన్ని నివేదిస్తున్నాయి.కాలుష్యం తగ్గడాన్ని స్వాగతిస్తూ పర్యావరణ వేత్తలు దీనిని మేలుకొలుపు పిలుపుగా చూడాలని ప్రభుత్వానికి కోరుతున్నారు. లాక్ డౌన్ తో కాలుష్యాన్ని నివారించడం సాధ్యపడిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో కూడా ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.భారత దేశం మొత్తం ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో సుమారు 130 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వం కోరడం జరిగింది. మన దేశంలో ఇప్పటి వరకూ 1000 మందికి పైగా కరోనా వైరస్ సోకింది. లాక్ డౌన్ దృష్ట్యా ప్రభుత్వం సామాజిక దూరం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు సవివరంగా తెలియజేస్తుంది. అందరూ ఇంట్లోనే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఫోన్ కాల్స్, ఆన్ లైన్ ప్రకటనల ద్వారా అవగాహన కల్పిస్తుంది. ఈ చర్య వలన దేశంలో అన్ని నగరాల్లో దాదాపు ట్రాఫిక్ సున్నా కావడంతో కాలుష్య స్థాయి అమాంతం పడిపోయింది. ఇది పర్యావరణానికి నిజంగా ఎంతో మంచి పరిణామం.సెంటర్ - రన్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్రకారం... కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇటీవల విధించిన లాక్ డౌన్ ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో పి.ఎం 2.5 దాదాపు 30 శాతం తగ్గింది. అహ్మదాబాద్ మరియు పూణేలో ఇది 15 శాతం తగ్గింది.ఇంకా శ్వాసకోస సమస్యల ప్రమాదాన్ని పెంచే నైట్రోజన్ ఆక్సైడ్ (NOx) కాలుష్యం స్థాయి కూడా ప్రస్తుతం తగ్గింది. నైట్రోజన్ ఆక్సైడ్ కాలుష్యానికి మోటారు వాహనాల రద్దీ అధికంగా ఉండటం ప్రధాన కారణం. పూణేలో ఈ స్థాయి 43 శాతం తగ్గగా ముంబైలో 38 శాతం, అహ్మదాబాద్ లో 50 శాతం తగ్గాయి.ప్రస్తుతం ఇది మంచి కేటగిరీలో ఉందని, కాలుష్యం కనిష్ట స్థాయిలో ఉండడం వలన మనం పీల్చుకునే గాలి పూర్తి ఆరోగ్యవంతమైనదని నిపుణులు చెబుతున్నారు.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) గణాంకాల ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత 'మంచి' కేటగిరీలో ఉంది. కాన్పూర్ యొక్క గాలి నాణ్యత 'సంతృప్తికరమైన' కేటగిరీలో ఉంది. అలాగే సిపిసిబి పర్యవేక్షణ కేంద్రాలు ఉన్న 92 ఇతర నగరాల్లో కూడా వాయు కాలుష్యం తక్కువగా నమోదైంది. ఇక్కడ గాలి నాణ్యత 'మంచి' నుండి 'సంతృప్తికరమైన' పరిధి మధ్యలో ఉంది.