YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

నూతన విధానంలోనూ ఇక్కట్లు

నూతన విధానంలోనూ ఇక్కట్లు

నల్గొండ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. అక్రమ దందాకు తెరదించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగానే ఫిబ్రవరి 1 నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ సదరు పద్ధతి అమలుకు నోచుకోలేదని సమాచారం. పాత విధానం రద్దు కావడం.. కొత్త విధానం అమలు కాకపోతుండడంతో ఇసుక కావాల్సినవారు నానాపాట్లు పడుతున్నారు. ఇసుక లేకపోవడంతో పలు నిర్మాణాలు నిలిచిపోయిన పరిస్థితి. కొత్త విధానంలో అనుమతి కోరుతూ డీడీలు తీసిన ట్రాక్టర్ల యజమానులకు మాత్రమే అప్పుడప్పుడూ అనుమతులు ఇస్తున్నారు అధికారులు. దీంతో ఇదే అదునుగా ఇసుక వ్యాపారులు అదనంగా వసూలు చేస్తున్నారని వినికిడి. దీనికితోడు కొన్ని గ్రామాలలో ఇసుక దొరకటమే కష్టంగా మారిపోయింది. దీంతో అనుమతుల కోసం స్థానిక ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

నల్గొండ జిల్లాలో 32 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. కొత్త పద్ధతిలో ముందుగా 9 రీచ్‌లను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇసుక వ్యవహారాన్ని ఇకమీదట ఆన్ లైన్ లోనే నిర్వహించనున్నారు. దీంతో అవకవతకలకు అవకాశమే ఉండదని అంతా భావిస్తున్నారు. ఇసుక కోసం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇసుక రవాణా చేసే వ్యాపారులు ముందే రూ.15 వేలు ప్రభుత్వానికి డీడీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ట్రాక్టర్‌కు అమర్చే జీపీఎస్‌ కోసం మరో రూ.10వేలు చెల్లించాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల లోపే ఇసుక రవాణా చేయాల్సి ఉంటుంది. అక్రమాలు జరగకుండా పర్యవేక్షించేందుకు ఇసుక రీచ్‌ల వద్ద అధికారులు ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఇసుక లోడింగ్‌ జరుగుతుంది. ఇసుక రవాణా చేసిన తర్వాతే ట్రాక్టర్‌ యజమాని ఖాతాలోకి డబ్బులను ఆన్‌లైన్‌లోనే జమచేస్తారు. మొత్తంగా ఈ కొత్త విధానంగా ఇసుక అక్రమ రవాణా గణనీయంగా తగ్గిపోతుందని అంతా భావిస్తున్నారు.

Related Posts