ఏడున్నర లక్షలకు చేరిన బాధితులు
34వేలకు చేరిన మృతులు
న్యూఢిల్లీ, మార్చి 30
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని అన్ని దేశాలూ విలవిలలాడుతున్నాయి. వేలాదిగా ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు. ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు లాక్‌డౌన్‌లో కొనసాగుతుండగా.. దాదాపు 350 కోట్ల మంది ప్రజల నిర్బంధంలోనే ఉన్నారు. వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినా వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 33వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 7.42 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా మరో 3వేల మంది మృతిచెందారు. వైరస్ నిర్ధారణ అయినవారిలో 1,52,000 మంది కోలుకుంటే.. మరో 5.09 లక్షల మందిలో స్వల్పంగా లక్షణాలు ఉన్నాయి. అయితే, 26,681 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది.కరోనా వైరస్ ప్రభావం యూరోపియన్ దేశాల్లో తీవ్రంగా ఉంది. మొత్తం కరోనా వైరస్ మరణాల్లో 70 శాతం ఐరోపా దేశాల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం. ఇటలీలో ప్రాణ నష్టం ఊహకు అందని రీతిలో పెరుగుతోంది. ఇటలీలో కోవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 11వేలకు చేరువవుతోంది. ఆదివారం ఇటలీలో మరో 750 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం 10,778 మంది ఇప్పటి వరకూ ప్రాణాలు మృతిచెందారు. కరోనా వైరస్‌తో ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించలేదు. ఆదివారం మరో 5,000 మందిలో వైరస్ నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 97,689కి చేరింది.అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఆ దేశంలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1.41 లక్షలు దాటింది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న న్యూయార్క్, న్యూ జెర్సీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,400కు చేరుకోగా.. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో దాదాపు 1,000 మంది హరీ అన్నారు. ఆదివారం 18వేలకుపైగా పాజిటివ్ కేసుల నమోదు కావడంతో అమెరికాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 141, 000కి పెరిగింది. ఇప్పటి వరకు 8,94,000 మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. న్యూయార్క్ రాష్ట్రంలో 60 వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనాలో ఆదివారం మరో ముగ్గరు చనిపోగా, 31 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 3,304కు చేరింది. బాధితుల సంఖ్య 81,470కి చేరింది. అటు స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, నెదర్లాండ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా మరణాల్లో స్పెయిన్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఇటలీ తర్వాత ఈ దేశంలోనే అత్యధికంగా 6,809 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్ యువరాణి సైతం కరోనా వైరస్‌తో కన్నుమూయడం గమనార్హం. ఆదివారం అక్కడ మరో 900 మంది మృతిచెందగా, కొత్తగా మరో 7వేల మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో స్పెయిన్‌లో కోవిడ్-19 బాధితుల సంఖ్య 80,000 వేలకు చేరింది.ఫ్రాన్స్, ఇరాన్, బ్రిటన్‌లోనూ కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 2,600 మందికిపైగా బలయ్యారు. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 40వేల మందికి వైరస్ సోకింది. జర్మనీలోనూ 57వేలకు పైగా కేసులు నమోదు కాగా, 541 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జర్మనీలో తీవ్ర విషాదం నెలకుంది. ఏకంగా ఆ దేశ ఆర్ధిక మంత్రి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేగింది. కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఆయన సూసైడ్ చేసుకున్నారని తెలుస్తోంది. హొచీమ్ పట్టణంలో ఆయన మృతదేహాన్ని హై స్పీడ్ రైల్వే లైన్‌పై గుర్తించారు.ఇరాన్‌లో 2,617 మంది, బ్రిటన్‌లో 1,228 మంది, నెదర్లాండ్‌లో 771, మంది, స్విట్జర్లాండ్‌లో 300 మంది, బెల్జియంలో 431 మంది చనిపోయారు. టర్కీలోనూ కోవిడ్ కేసులు 9,661కు చేరుకోగా, 131 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్‌లోనూ వైరస్ ఉగ్రరూపం దాల్చింది. బ్రిటన్ యువరాజు, ప్రధాని, ఆరోగ్య మంత్రి సైతం దీని బాధితులయ్యారు. ఇప్పటి వరకు బ్రిటన్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 19,522గా నమోదయ్యింది. వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 1,228కి చేరింది. పాకిస్థాన్‌ను కరోనా మరింత భయపెడుతోంది. అక్కడ ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా, కేసుల సంఖ్య 1,597కు చేరింది.