YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

1100కు పెరిగిన కరోనా కేసులు

1100కు పెరిగిన కరోనా కేసులు

1100కు పెరిగిన కరోనా కేసులు
హైద్రాబాద్, మార్చి 30
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. దీనిని మరింత కట్టుదిట్టంగా అమలుచేయాలని కేంద్రం మరోసారి రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులను మూసివేసి, ఎక్కడివారిని అక్కడే నిలిపివేయాలని సూచించింది. వలస కార్మికుల కదలికలతో వైరస్ ముప్పు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా, కరోనాపై పోరాటంలో గెలుపు మనదేనని, లాక్‌డౌన్‌తో సామాన్యులకు ఇబ్బందులైనా దేశ ప్రజల సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మహమ్మారిపై పోరాటానికి అందరూ సహకరించాలని మరోసారి ప్రధాని కోరారు.ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 1,100కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా వైరస్ కేసులు దేశంలో వెలుగుచూసిన తర్వాత ఆదివారం అత్యధికంగా 130 కేసులు నమోదయ్యాయి. ఇదే ఇప్పటి వరకు నమోదైన అత్యధిక కేసులు. ఆదివారం కేరళలో మరో 19 కేసులు, మహారాష్ట్రలో 16 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య మహారాష్ట్రలో 203, కేరళలో 202కి చేరింది. అనధికారిక లెక్కల ప్రకారం.. దేశంలో కరోనా కేసుల సంఖ్య సోమవారం ఉదయానికి 1139కి చేరింది. వీరిలో 103 మంది కోలుకోగా, 27 మంది మృతిచెందారు.మరోవైపు, దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 35వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న ల్యాబ్‌లో కేవలం 30% వరకే ఉపయోగించుకుంటున్నట్లు తెలిపింది. పరీక్షల సంఖ్య తక్కువగా ఉండడంవల్లే ప్రస్తుతం బాధితుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు భావించడం లేదని స్పష్టంచేసింది. ప్రస్తుతం దేశంలో రోజూ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ సూచించారు. వైద్య నిపుణుల సూచనల ఆధారంగా ప్రభుత్వం అమలుచేస్తున్న మార్గదర్శకాలను 100% అమలుచేయాలని, ఒకవేళ 99 శాతం అమలుచేసినా అనుకున్నది సాధించలేమన్నారు. దేశంలో ఒక జిల్లాలో ఒక వ్యక్తి అమలుచేయకపోయినా మనం మళ్లీ మొదటికొస్తామని అని ఆయన హెచ్చరించారు.తెలంగాణలోనూ కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తిచెందుతోంది. ఆదివారం కొత్తగా మరొకరికి వైరస్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 70కి చేరుకున్నట్టు తెలిపారు. అయితే, ఇప్పటికే కరోనా సోకినవారిలో 11 మంది కోలుకున్నారని, ఒకరికి మాత్రం పరిస్థితి కాస్త విషమంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కరోనాతో ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, మరో వ్యక్తి ఆదివారం మృతి చెందాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆదివారం మరో ఇద్దరికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 21కి చేరింది. విశాఖలో మరో 2 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. బర్మింగ్ హమ్ నుంచి వచ్చిన వ్యక్తి కరోనా పొజిటివ్ వ్యక్తితో కాంటాక్ట్ అయిన ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఆదివారం 85 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 83 మందికి నెగటివ్‌గా, ఇద్దరికి పాజిటివ్‌గా వచ్చింది. ఇదిలా ఉండగా, ఢిల్లీలో మత కార్యక్రమానికి ఏపీ నుంచి 500 మంది హాజరయ్యారు. అక్కడ నుంచి తిరిగొచ్చినవారిలో కొందరికి వైరస్ సోకింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇలాంటి కేసులు బయటపడ్డాయిఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 27 మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్ర ఏడు, గుజరాత్ 5, కర్ణాటకలో 3, మధ్యప్రదేశ్ 2, ఢిల్లీ 2, రాజస్థాన్ 1, కేరళ, జమ్మూ కశ్మీర్ తెలంగాణ, పశ్చిమ్ బెంగాల్, పంజాబ్‌లో ఒక్కొక్కరు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర 203, కేరళ 202, ఢిల్లీ 72, ఉత్తరప్రదేశ్‌ 72, కర్ణాటక 83,లడఖ్ 13, తెలంగాణ 70, రాజస్థాన్ 59, జమ్మూ కశ్మీర్‌38, గుజరాత్ 63, ఆంధ్రప్రదేశ్ 21, తమిళనాడు 50, మధ్యప్రదేశ్ 39, పంజాబ్ 38, హర్యానా 35, పశ్చిమ్ బెంగాల్ 21, బీహార్ 15, అండమాన్ నికోబార్ దీవులు 9, మిగతా రాష్ట్రాల్లో 10లోపు కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,100 కేసుల్లో 59 మందికిపైగా విదేశీయులు ఉన్నట్టు పేర్కొంది.

Related Posts