వేడి వాతావరణంలోనూ కరోనా
న్యూఢిల్లీ, మార్చి 30
ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కొత్తరకం కరోనా వైరస్.. శీతల వాతావరణంలోనే వ్యాప్తిచెందుతుందని, అధిక ఉష్ణోగ్రత ప్రాంతాల్లో విస్తరించదనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఉద్ఘాటించింది. అధిక వేడి, తేమతో కూడిన వాతావరణం సహా అన్ని ప్రాంతాల్లోనూ ఇది వ్యాప్తిచెందుతున్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. వాతావరణంతో సంబంధం లేకుండా నివాసిత లేదా ప్రయాణించే ప్రదేశాల్లో సరైన రక్షణ చర్యలను అనుసరించాలని సూచించింది. తరుచూ చేతులను శుభ్రం చేసుకోవడమే కోవిడ్-19ను నియంత్రించడానికి సరైన చర్య అని తెలిపింది. ఒకవేళ చేతులపై ఉండే వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే కళ్లు, నోరు, ముక్కును తరుచూ తాకరాదని పేర్కొంది.అలాగే, చల్లని వాతావరణంలో ఉండేవారికి కొత్తరకం కరోనా వైరస్ లేదా ఇతర వ్యాధులు వల్ల ప్రాణాలు కోల్పోతారనడానికి ఎలాంటి కారణం లేదని వివరిచింది. బాహ్య ఉష్ణోగ్రత, వాతావరణంతో సంబంధం లేకుండా మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 36.5 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలిపింది. కాబట్టి చల్లటి వాతావరణానికి, వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆల్క్‌హాల్ శాతం ఎక్కువగా ఉండే శానిటైజర్స్, సబ్బుతో చేతులను తరుచూ శుభ్రం చేసుకోవడమే ఉత్తమమైన మార్గమని పేర్కొంది.అలాగే వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా వైరస్ సోకదనేది అపోహ మాత్రమేనని, శరీరంలోనే ఉష్ణోగ్రత 37 డిగ్రీల వరకు ఉంటుంది. ఎక్కువ వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తే శరీరంపై బొబ్బలు ఏర్పడతాయంది. అలాగే, దోమల వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవంది. కొత్తరకం కరోనావైరస్ అనేది శ్వాసకోశ వైరస్.. ఇది ప్రధానంగా దీని బారిపడ్డ వ్యక్తి దగ్గినా లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కు నుంచి విడుదలయ్యే లాలాజల బిందువుల ద్వారా సంక్రమిస్తుంది.