YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో పొంచి ఉన్న ప్రమాదం

తెలుగు రాష్ట్రాల్లో పొంచి ఉన్న ప్రమాదం

తెలుగు రాష్ట్రాల్లో పొంచి ఉన్న ప్రమాదం
హైద్రాబాద్, విజయవాడ, మార్చి 30
దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని చర్యతో స్థాణువుగా మారిపోయిన కోట్లాది ప్రజలు ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. వారి చేష్టల్లో, చర్యల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ మినహాయింపు సమయాల్లో రైతుబజార్లపైన, నిత్యావసర దుకాణాలపైన సమూహాలుగా దాడి చేస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ లక్ష్యమే దెబ్బతింటోంది. సమర్థమైన యంత్రాంగం ఉన్నప్పటికీ సక్రమ కార్యాచరణ లోపించడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ప్రజల అసంతృప్తికి దారి తీస్తోంది. స్వచ్ఛందంగా సహకరించేందుకు, 21 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండాలనే విషయంలో ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. అయితే రోజువారీ ఆహారపదార్ధాల సంగతేమిటన్నదే వారిని కలవరపరుస్తోంది. ఈవిషయంలో ఢోకాలేదని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ప్రజలు రోడ్లపైకి ఎగబడుతున్నారు.ప్రజలు రోడ్లపైకి రాకుండా నియంత్రించడానికి పోలీసు, రెవిన్యూ యంత్రాంగాలు కిందామీదా పడుతున్నాయి. ఇంటింటికి సరుకులు అందించేందుకు ఏర్పాట్లు చేయడమే ఇందుకు తరుణోపాయంగా చెప్పాలి. లేకపోతే లాక్ డౌన్ ఎన్నిరోజులు పెట్టినప్పటికీ ప్రయోజనం శూన్యమే. కార్యాలయాలకు సెలవులు ప్రకటించినందు వల్ల సిబ్బంది అందుబాటులోనే ఉన్నారు. ప్రజారవాణా నిలిచిపోవడంతో ప్రతినగరం, పట్టణంలో వేల సంఖ్యలో ఆటోలకూ కొరత లేదు. నిర్దిష్టమైన సంఖ్యలో వీటిని వినియోగించుకుంటూ సమీప దుకాణాల నుంచి పౌరసరఫరాల యంత్రాంగమే ఇంటింటి సరఫరాలు చేపడితే సత్ఫలితాలు వస్తాయి. వ్యాపారుల దోపిడీని నివారిస్తూ ప్రజలకు సరసమైన ధరలకు సరుకులను అందించవచ్చు. ఆధునిక సాంకేతికత, మొబైల్ పరిజ్ణానంతో సమీప దుకాణాలకు తమకు కావాల్సిన సరుకుల చిట్టాను ప్రజలు వాట్సాప్ లలో పంపుకోవచ్చు. తదనుగుణంగా ప్యాకేజీ రూపంలో సరుకులు ఇంటింటికి సరఫరా చేయవచ్చు. ఇది అత్యంత సులభతరమే కాకుండా, సాధారణ ప్రజలు విచ్చలవిడిగా రోడ్లమీద కు రావాల్సిన గత్యంతరాన్ని తప్పిస్తుంది. అప్పుడు నియంత్రణను కఠినంగా అమలు చేయవచ్చు. ఆ దిశలో ప్రభుత్వాలు తక్షణం స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.లాక్ డౌన్ సందర్భంలో ప్రధానమంత్రి కేవలం 15 వేల కోట్లరూపాయల ప్యాకేజీని మాత్రమే ప్రకటించడంతో ఏ మూలకు సరిపోతుందనే విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి ఆ మొత్తం వైద్య సేవల నిమిత్తం తక్షణ అవసరంగా వెచ్చించేది. 40 శాతం వరకూ పేదలు, రోజువారీ కూలీలు, అసంఘటిత రంగ జీవనంతో అల్లాడుతున్నవారు ఉన్న దేశం మనది. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి. ఆహారధాన్యాలు, గ్యాస్ సిలిండర్లు, చిన్నాచితక సాయం కోసం లక్షా డెబ్భైవేల కోట్ల రూపాయల ప్యాకేజీని తాజాగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. సక్రమంగా అమలు చేస్తే ఒకటి రెండు నెలలపాటు పేదలకు ఉపకరించే పథకం ఇది. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనేది ఈ స్కీమ్ లక్ష్యం. రాష్ట్రప్రభుత్వాలు సైతం రంగంలోకి దిగి ఈ క్లిష్లసమయాల్లో పదిహేను నుంచి 20 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాలతో ఊతమిస్తే సగటు పేద వర్గాల ప్రజల జీవన స్థితిగతులు తలకిందులు కాకుండా ఉంటాయి. అవసరమున్నా లేకున్నా వర్గాల వారీ చేసే ఉచిత నగదు పంపిణీల కంటే ప్రస్తుత సంక్షోభ సమయాల్లో అందించే చేయూత చాలా విలువైనది. చేతిలో చేవ ఉన్నా, సంపాదించుకునే సత్తువ ఉన్నా రోడ్డుమీదకు వెళ్లలేని స్థితి. అందువల్ల ప్రభుత్వాలే శ్రమజీవుల అవసరాలు తీర్చాలి. కార్మికులను గట్టెక్కించాలి. కూలీలకు కూసింత అండగా నిలవాలి. డాక్టర్లు, నర్సులు, వైద్య సేవలు అందిస్తున్నవారికి కేంద్రం ప్రత్యేక బీమా సదుపాయాన్ని ప్రకటించడమూ ఒక మంచి పరిణామమే. తమ కుటుంబాలను, ఆరోగ్యాలను పణంగా పెడుతూ పగలూ రాత్రి శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి బీమా భరోసా నిస్తుంది. నిరంతరం నియంత్రణ కృషిలో నిమగ్నమవుతున్న పోలీసులు, సమాచార రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సైతం ఈ సదుపాయాన్ని అందించేందుకు రాష్ట్రప్రభుత్వాలు తమ వంతుగా కృషి చేయాలి.దేశంలోనే అయిదో పెద్దనగరమైన హైదరాబాద్ కు వివిధ దేశాలతో రాకపోకలు విస్తారంగా సాగుతూ ఉంటాయి. అందువల్ల కోవిడ్ ప్రమాదాన్ని తెలంగాణా రాష్ట్రం ఎక్కువగానే ఎదుర్కొంటోంది. అయినప్పటికీ బాధితుల సంఖ్యను ప్రస్తుతానికి 50 లోపునకు పరిమితం చేయడం లో విజయం సాధించింది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి కఠినంగా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయంగా, దేశీయంగా కరోనా కేసులు గడచిన అయిదు రోజుల్లోనే నాలుగైదు రెట్లు పెరిగాయి. ఇది వ్యాప్తి తీవ్రతకు సంకేతం. దీనిని ద్రుష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, సర్పంచులు అంటే ప్రజలకు ఒక నమ్మకం. అధికారులకంటే ప్రజాప్రతినిధులనే ప్రజలు ఎక్కువ విశ్వసిస్తారు. నిలదీస్తారు. అందువల్ల తమ ప్రాంతాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాద్యత వారిదే.తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ ప్రభావం కొంచెం తక్కువే. అందుకే ఈ తీవ్రతను ముందుగా గుర్తించలేదు. అయితే కరోనా కట్టడి విషయంలో కొంచెం ఆలస్యంగానే మేలుకొన్నప్పటికీ పక్క రాష్ట్రమైన తెలంగాణతో కలిసి అడుగులు వేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేయడం సముచితమైన నిర్ణయమే. ఆంధ్రప్రాంతానికి చెందిన వేల మంది విద్యార్థులు తెలంగాణలో విద్యాభ్యాసం, పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్నారు. నగరీకరణ నేపథ్యంలో వారు ఏయే ప్రాంతాల్లో తిరిగారో తెలియదు. కరోనా ప్రభావం వారిమీద ఉన్నదీ లేనిదీ సైతం గుర్తుపట్టలేం. అందువల్ల వారంతా సొంత రాష్ట్రానికి వచ్చి స్వేచ్ఛగా తిరిగితే కుటుంబ సభ్యులకు, వారు నివసించే ప్రాంతాలకు సైతం వ్యాధి సోకే ప్రమాదం పొంచి ఉంటుంది. అందువల్ల లాక్ డౌన్ సమయం ముగిసే వరకూ వారు ఇంతవరకూ నివసించిన ప్రాంతాల్లో ఉండటమే శ్రేయస్కరం. ఒకవేళ వ్యాధి బయటపడితే చికిత్స పొందడం సులభమవుతుంది. విస్తరించకుండా ప్రభుత్వాలు కట్టడి చేయగలుగుతాయి. ఈవిషయంలో ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా సహకరించుకోవాలి

Related Posts