15 తర్వాత టెన్త్ పరీక్షలు
హైద్రాబాద్, మార్చి 30
కరోనా వైరస్ ప్రభావంతో అన్ని రకాల పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే అనేక రకాల పరీక్షల్ని అధికారులు వాయిదా వేశారు. స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు అన్నీ బంద్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. అటు ఏపీలో కూడా అన్ని పరీక్షల్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షలను హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేశారు. అయితే మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు పరీక్షలను నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఇంతలోనే కరోనా వైరస్ మన రాష్ట్రానికి రావడం... దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ఆ ప్రభావం పరీక్షలపై పడింది. దీంతో తెలంగాణలో పదోతరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి.ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఏ. సత్యనారాయణ రెడ్డి సోమవారం వెల్లడించారు. వాయిదా పడిన పదో తరగతి పరీక్షలతోపాటు అన్ని ఇతర పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను తర్వలోనే ఖరారు చేసి ప్రకటిస్తామన్నారు. అంతవరకు విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తెలంగాణలో కరోనా కేసులు 70 నమోదు నమోదయ్యాయి. ఇక భారత్‌లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 1100కు పైగా కరోనా పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి.