YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

రైతన్నకు హమాలీ పోటు

రైతన్నకు హమాలీ పోటు

నిర్మల్ జిల్లాలో వరి రైతులకు హమాలి సక్రమంగా దక్కడంలేదని తెలుస్తోంది. హమాలి కోసం రైతన్నలు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారని, అయితే ఈ సమస్య ఇప్పటికీ కొలిక్కి రాలేదని సమాచారం. వరికి మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా హమాలి కూలీ మాత్రం చెల్లించడం లేదని రైతులు వాపోతున్నారు. హమాలీ రూపంలో తమపై ఏటా రూ.కోట్ల భారం పడుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హమాలీ రూపంలో వచ్చేది కొద్ది మొత్తమే అయినా అదీ సకాలంలో చెల్లించడం లేదని అంటున్నారు.  రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఏటా సర్కార్ ఖరీఫ్‌, యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేసి లారీలో నింపేందుకు క్వింటాలుకు రూ.30 నుంచి రూ.35 వరకు హమాలి కూలీ కింద రైతులు ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం క్వింటాలుకు రూ. 5.30పై మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో కనీసం ఏడోవంతు కూడా రైతుకు అందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే ఈ నామమాత్రం హమాలి ఖర్చు సమయానికి అందడంలేదు. ఎప్పుడో ఏడాది గడిచిన తర్వాత రైతులకు అందుతోంది. అయితే ఇదీ పూర్తిగా ఉండడం లేదు. 

గతంలో హమాలి కూలీ కింద రైతులకు క్వింటాలుకు రూ.11 అందించారు. మూడేళ్లుగా కేవలం రూ.5 చెల్లిస్తున్నారు. దీంతో రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. నిర్మల్ జిల్లాలో ఖరీఫ్‌ కొనుగోళ్లు ముగిసి నెలలు గడిచాయి. అయినప్పటికీ ఇంతవరకు కూలీ డబ్బులు రైతుల చేతికందలేదు. దీంతో హమాలి కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. రైతులు చెల్లించిన దానికి ప్రభుత్వం తిరిగి చెల్లించేది నామమాత్రమే. అయితే ఈ కొద్ది మొత్తం అందితే వారికి బోల్డంత భరోసా. ఆర్ధిక సమస్యల్లో ఉన్న రైతులకు రూపాయి తిరిగి వచ్చినా వారికి గొప్ప మేలు జరిగినట్లే. అయితే హమాలి రూపంలో వచ్చే చిన్నమొత్తం సకాలంలో రావడం లేదు. ఎప్పుడో ఏడాది దాటిన తర్వాత వస్తుండడంతో ఈ సంగతి చాలా మందికి తెలియక నష్టపోతున్నారు. హమాలీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కాకుండా నగదు సంఘాలకు వస్తుంది. వారి నుంచే రైతులు డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. దీంతో కొన్ని చోట్ల రైతులకు డబ్బులు వచ్చిన విషయం కూడా తెలియక నష్టపోతున్నారు. ఈ ఇబ్బందులు గుర్తించి సంబంధిత అధికార యంత్రాంగం హమాలీ డబ్బులు రైతులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

Related Posts