Highlights
- కొండ పై నివాసాలకు పట్టాలు పొందిన వారికి 5 తరువాత అమ్ముకొనేలా వెసులుబాటు.
- అభ్యంతరం లేని 10 వేల ఆక్రమణల క్రమబద్దీకరణకు అంగీకారం.
- కృష్ణా జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన మంత్రి వర్గ ఉపసంఘం
విజయవాడ నగర పరిధిలో అభ్యంతరంలేని ప్రభుత్వ స్ధలాల్లో ఏర్పరుచుకున్న నివాస స్థలాల్లో క్రమబద్దీకరణ ప్రక్రియ త్వరగా ముగించాలన్నారు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. అసైన్డ్ చేయబడిన ఇళ్ల పట్టాలు పొందినవారి నివాస స్థలాలు అమ్ముకునేందుకు లేదా బ్యాంకు రుణాలు పొందేలా వెసులుబాటు కల్పిస్తూ విధి విధానాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని, ఇళ్లు నిర్మించుకున్న వారి నివాసాల క్రమబద్దీకరణ పై మంత్రివర్గఉపసంఘం సమావేశం జరిగింది. అసెంబ్లీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కే.ఈ కృష్ణమూర్తితో పాటు రవాణా శాఖ మంత్రి అచ్చన్నాయుడు, సి.సి.ఎల్.ఏ అనీల్ చంద్ర పుణేఠా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్, సర్వే కమీషనర్ జగన్నాధం, కృష్ణా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమీషనర్, స్ధానిక ఎమ్మెల్యేలు బోండా ఉమ, జలీల్ ఖాన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
విజయవాడ నగర పరిధిలో అభ్యంతరంలేని ఆక్రమణలు 10 వేలు ఉన్నాయని, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వీటిని క్రమబద్దీకరించవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకొచ్చారు. అయితే కొండ మీద నివాసం ఉంటున్నవారికి ప్రభుత్వం గతంలోనే 40 వేల పట్టాలు జారీ చేసిందని, వీరికి అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేల వినతికి సానుకూలంగా స్పందించిన మంత్రివర్గ ఉపసంఘం 5 సంవత్సరాల తరువాత వాటిని అమ్ముకునే విధంగా విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మరో వైపు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు కృష్ణానది, కాలువుల ఒడ్డున ఇళ్లు నిర్మించుకున్న వారి నివాసాలను క్రమబద్దీకరించలేమని, సుమారు 18వేల నివాసాలు ఇలాంటివి ఉన్నాయని అధికారులు ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చారు. విజయవాడ పట్టణంలోనే వీరికి ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన స్థలాలు గుర్తించి, నివాసాలు నిర్మించిన తరువాత విడతలవారీగా వీరిని తరలించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.