*ఈశ్వరోపాసన*
ఎవరికీ తల వంచని వీరుడు సైతం భగవంతుడి ముందు చేతులు జోడించి వినమ్రంగా నిలుస్తాడు. అది ఆనందదాయకమైన కార్యం! భగవద్దర్శనం ఎంతో ప్రశాంతిని కలగజేస్తుంది. తన్మయం కలిగినవారు భగవంతుడి దివ్యసుందర విగ్రహాన్ని అలా చూస్తూనే ఉండిపోతారు. దైవదర్శనం చేసుకోగానే ప్రతివారూ చేసే పని కోరికలు తీర్చమని ప్రార్థించడం! అలా కోరుకున్నంత మాత్రాన కోరికలు తీరవని విమర్శకులు అంటారు. ఎవరేమన్నా చిత్తం ప్రశాంతం కావడం తథ్యం! హిందూ సంప్రదాయంలో-దర్శించిన ఓ మహాక్షేత్రం, విన్న ఓ అద్భుత ప్రవచనం వల్ల విశ్వాసం ప్రవర్ధిల్లుతుంది. ఆధ్యాత్మిక జగత్తులో విశ్వానికే గురుస్థానమైన భరతభూమిలో వైవిధ్యమైన మానవాళిలో అనేక దేవతామూర్తుల ఆరాధనకు సనాతన ధర్మం ద్వారాలు తెరిచింది. కనిపించే ప్రపంచంలో ప్రతి వస్తువుకూ ఓ నిర్మాత ఉన్నాడు. మరి పరమాత్మ ఉంటే అతణ్ని ఎవరు సృజించారు... ఎవరూ సృజించక అతడు ఎలా ఉన్నాడు? ఈ ప్రశ్నలకు జవాబు ఎక్కడ లభిస్తుంది? చెట్టు ముందా, విత్తు ముందా అన్న ప్రశ్న అలాంటిదే! అనంత రోదసిలో గ్రహాలు, నక్షత్రాలు తమ తమ గురుత్వాకర్షణతో ఉపస్థితమై ఉన్నాయి. నిజానికి ఈ శూన్యం ఎంతమేర వ్యాపించి ఉంది, సరిహద్దులు ఉన్నాయా, సరిహద్దుల ఆవల ఏముంది? పోతన మాటల్లో- పెంజీకటికి ఆవల ఎవరు ఏకాకృతిన వెలుగులు పంచుతున్నాడో అతడే దేవుడు అన్నది విదిత సత్యం! బ్రహ్మదేవుణ్ని మొదట శ్రీమహావిష్ణువు సృజించాక ఆయన తాను ఉపస్థితుడై ఉన్న కమలం లోతు తెలుసుకోవాలనుకున్నాడట! ఎంత లోతులకు పోయినా ఆయనకు ఆద్యంతాలు బోధపడలేదు. తిరిగి వచ్చి కమలంలో కూర్చున్నాడు! మహావిష్ణు ఆదేశం మేరకు సృష్టి చేయవలసి ఉంది. ఎలా మొదలుపెట్టాలో తెలియలేదు. ఆయనకు ‘తప’ ‘తప’ అన్న శబ్దం వినిపించింది. అది వినవస్తున్న దిక్కుకు చూశాడు. ఎవరూ కనిపించలేదు. విష్ణుదేవుడి ఆదేశమే అని భావించి వెయ్యి సంవత్సరాలు తపమాచరించాడు. సంతసించిన విష్ణువు సృష్టి ప్రక్రియ బోధించాడని ప్రతీతి.భగవంతుడిపై దృష్టి నిలపడమే తపస్సు. కాలానుగుణంగా ఆయన్ను మనసులో నిలుపుకోవడమే! తొమ్మిది భక్తి మార్గాల్లో అది ఒకటి. పరమేష్ఠి లీలలను, గాథలను శ్రవణం చేయవచ్చు. విన్నదాన్ని మననం చేయడం ద్వారా సద్గతులు కలుగుతాయన్నారు పెద్దలు. మనసు శుద్ధి చేసుకొనే మార్గాలను అనుసరించి పవిత్రత సాధించవచ్చు. అలా సొంతమయ్యే ప్రశాంతి వల్ల మానవుడు అనేక లాభాలు పొందే వీలుంది. ఆరోగ్యకరమైన శరీరంతో పొందే మానసిక ఆరోగ్య, ఆనందాలతో సాధకుడు ఆధ్యాత్మిక పరిణతి సాధిస్తాడు. వికృతమైన మనసులో దైవం నెలకొనే అవకాశం లేదు. అనంత అంతరిక్షాన్ని, అందులోని అసంఖ్యాక గ్రహ, నక్షత్ర రాశులను ఓ పరిశోధకుడిగా, జిజ్ఞాసువుగా అవలోకించినప్పుడు, ‘ప్రతి వస్తువుకూ ఓ నిర్మాత ఉంటాడు’ అన్న తర్కం ఆధారంగా సమస్త విశ్వస్రష్టయే భగవంతుడని నిర్ధారించగలుగుతాం. చెత్తను కాల్చినప్పుడు విషవాయువులు వెలువడతాయి. మంచి గంధపు చెక్కను కాలిస్తేపరిమళాలు వెదజల్లుతుంది. కలుషిత చిత్తంలో దుర్మార్గపు ఆలోచనలు కలుగుతాయి. మంచి మనసు పవిత్ర ఆలోచనలకు వేదిక అవుతుంది. మానవుడికి మనసే కీలకం! ఆ మనసును పవిత్రంగా ఉంచుకోవడం సాధనలో ముందడుగు. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వశ్రేష్ఠుడు, సర్వ శక్తిమంతుడు. అది ఆయన అనంతత్వాన్ని సూచిస్తుంది. అనంత వైభవోపేతుడైన అంతర్యామి సృజించిన మాయను సామాన్య మానవులు దాటలేరు. మాయను దాటలేని కారణంగా దాటించమని కోరుతూ పరమేష్ఠినే శరణాగతి కోరడం ద్వారా అనుగ్రహాన్ని పొందేందుకు సాధకులు త్రికరణ శుద్ధిగా ప్రయత్నించాలి
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో