కనకాంబరాన్ని కాటేసిన వైరస్ (అనంతపురం)
అనంతపురం, మార్చి 31 (న్యూస్ పల్స్): కొవిడ్ -19 (కరోనా వైరస్) దెబ్బ కనకాంబరంపై పడింది. పదిహేను రోజుల కిందట కిలో రూ.500 పలికిన పూల ధర దాదాపపు 90శాతం పడి పోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని నగరాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు కరోనా దెబ్బకు వాయిదా వేయడం.. ప్రముఖ దేవాలయాలు మూసివేయడంతో పూల ఎగుమతి నిలిచి పోయింది. సాగు చేసిన రైతులు పొలం నుంచి కనకాంబరాలను సేకరించేందుకు కిలోకు రూ.75 కూలీలకు వెచ్చించాల్సి ఉంది. మార్కెట్‌కు తీసుకువెళ్లి పూలు విక్రయిస్తే కిలో రూ.50 నుంచి రూ.60 మాత్రమే పలుకుతుండటంతో రైతులు నష్టాలపాలవుతున్నాడు. పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాలకు, నగరాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యాపారులు, రైతులతో కళకళలాడే బత్తలపల్లి, కదిరి కనకాంబరాల మార్కెట్‌లు వెలవెలబోతున్నాయి. అనంత, చిత్తూరు, కడప జిల్లాల్లో పూలు విక్రయించే వారికి అరకిలో, కిలో చొప్పున అమ్మేందుకు బత్తలపల్లి, కదిరి మార్కెట్‌కు చిరు వ్యాపారులు చేరుకొని కొనుగోలు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కనకాంబరాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. బత్తలపల్లి, కదిరి పూల మండీల నిర్వాహకులు ఈ రాష్ట్రాలకు బస్సుల ద్వారా పూలు ఎగుమతి చేస్తారు. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగళూరు, ఒంగోలు, మార్కాపురం, నెల్లూరు ప్రాంతాలకు బత్తలపల్లి నుంచి ఎగుమతి అయ్యేవి. పది రోజులుగా కరోనా ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోయాయి. అక్కడి వ్యాపారులు రోజు రోజుకూ పూల కొనుగోళ్లను తగ్గించడంతో అమాంతంగా ధర క్షీణించింది. అనంతపురం గ్రామీణ, శింగనమల, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో కనకాంబరం సాగు ఎక్కువగా అవుతోంది. మెట్టపంటల సాగులో నష్టాలు వస్తుండటంతో వేరుసెనగ, ఇతర పంటల సాగును వదిలి రైతులు బోరుబావుల కింద కనకాంబరాల సాగు చేస్తూ ఆదాయం పొందేవారు. దశాబ్దంగా ఎన్నడూ లేని విధంగా పూలధర పతనం కావడంతో తోటల్లో పనిచేసే కూలీలకు సైతం ఉపాధి కరవైంది.చాలా మంది తోటల్లో పూలు కోయకుండా వదిలేశారు.