YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 కరోనాతో వలస వాసుల కష్టాలు

 కరోనాతో వలస వాసుల కష్టాలు

 కరోనాతో వలస వాసుల కష్టాలు
శ్రీకాకుళం, మార్చి 31
కరోనా వైరస్‌ సిక్కోలువాసులను చిక్కుల్లో పడేసింది. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన వారితో పాటు యాత్రికులను ఎక్కడికక్కడ నిర్బంధంలో చిక్కుకునేలా చేసింది. తమ సొంత గ్రామాలకు ఎలా చేరుకోవాలో తెలియక వారంతా బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. జిల్లాలోని ఎచ్చెర్ల, రణస్థలం, గార, శ్రీకాకుళం రూరల్, ఇచ్ఛాపురం, కవిటి, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు తదితర ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది మత్స్యకారులు వలస కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరంతా గుజరాత్‌ రాష్ట్రంలోని వీరావల్, సూరత్, మహరాష్ట్రలోని పూనే, ముంబై, కర్ణాటకలోని మంగుళూరు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లారు. నెలల పాటు సముద్రంలో ఉండి చేపల వేటసాగిస్తారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశంలో 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ పనిలేక, సొంత గ్రామాలకు చేరుకునే వీలు లేక వీరంతా సతమతమవుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధించడంతో చాలామంది కర్ణాటక వెళ్లిన చాలామంది చిత్తూరు జిల్లాలో ఇరుక్కుపోయారు. స్థానిక పోలీసులు ఇటువంటి వారిని సహాయ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు గుజరాత్‌ వెళ్లిన మత్స్యకారులదీ ఇదే పరిస్థితి. తమవారి పరిస్థితి తెలియక ఇక్కడి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లా నుంచి 11 నుంచి 12 వేల మంది మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో వలసకార్మికులుగా జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఎచ్చెర్ల మండలంలోని బుడగట్లపాలెం, బడివానిపేట, డి.మత్స్యలేశం పంచాయతీలకు చెందిన మత్స్యకారులకు చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో భోజన, వసతి సౌకర్యాలను అక్కడి మత్స్యశాఖ అధికారులు కల్పించారు. కర్ణాటక రాష్ట్రానికి చేపలవేటకు వెళ్లి ఇంటికి వస్తుండగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వీరంతా చిత్తూరు సరిహద్దుల్లో ఉండిపోయారు. మొత్తం 51 మంది మత్స్యకారులు చిక్కుకున్న విషయాన్ని స్థానిక మత్స్యకార నాయకులు జిల్లా మత్స్యశాఖ అధికారులకు తెలియజేశారు. కలెక్టర్‌ స్పందించి చిత్తూరు జిల్లా అధికారులతో మాట్లాడి అక్కడి బీసీ వసతిగృహంలో వసతి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టారు.  మండలంలోని చోడవరం గ్రామానికి చెందిన కూలీలు బతుకు తెరువు కోసం విజయవాడ వెళ్లారు. కరోనా వైరస్‌ కారణంగా రాకపోకలు నిలిచిపోవడం, అక్కడ పనులు లేక తినటానికి తిండిలేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మూడు రోజులుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పనులు లేక పస్తులుంటున్నారు.

Related Posts