YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మిర్చి పంట రైతులకు కన్నీరు

మిర్చి పంట రైతులకు కన్నీరు

మిర్చి పంట రైతులకు కన్నీరు
విజయవాడ, మార్చి 31,
కృష్ణాజిల్లా దివిసీమలో పచ్చి మిర్చి పంట రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధర లేకపోవడంతో రైతులు మిర్చిని కోసేసి సమీపంలోని కృష్ణానదిలో పారబోస్తున్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని నాగాయతిప్ప, కోసూరువారిపాలెంలో రైతుల వద్ద కిలో మిర్చి కేవలం రూపాయి నుంచి మూడు రూపాయలే పలుకుతుండడంతో రైతులు తమ పంటను  కృష్ణానదిలో పారబోసి నిరసన తెలియజేశారు. ఈ గ్రామాల పరిధిలోని 15 మంది రైతులు 200 బస్తాల మిర్చి ఇలా నదిలో పారబోశారు. పంటకు ధర లేకపోవడంతో దిక్కులేక ఇలా పారబోస్తున్నామని పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. కృష్ణాజిల్లా  మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లో గత ఏడాది డిసెంబర్‌లో 320 ఎకరాల్లో సాగుచేశారు. మోపిదేవి మండలంలో అత్యధికంగా 250 ఎకరాల్లో సాగయింది. ఈ ప్రాంతంలో వీఎన్‌ఆర్‌ 145, టొకీటో 006 యూఎస్‌ రకాలను సాగుచేశారు. ఇవి పచ్చిమిర్చికి మాత్రమే పనికొస్తాయి. ఎండుమిర్చికి ఉపయోగపడవు. ధర పడిపోవడంతో చేసేదిలేక కూలీలతో కోయించి పారబోస్తున్నామని, అలాగే వదిలేస్తే మిగిలిన పంట రాదని పలువురు రైతులు చెప్పారు. మరోవైపు.. మిర్చి పంట సాగు చేయడానికి కౌలుతో కలుపుకుని ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.25లక్షలు ఖర్చు చేశారు. రెండేళ్ల క్రితం మిర్చి పంట లాభాలు తెచ్చిపెట్టగా.. ఆదే ఆశతో ఈ ఏడాదీ పెద్దఎత్తున సాగుచేసిన రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది.పొలం వద్ద కిలో మిర్చి మూడు రూపాయలకు కొంటున్నారు. కానీ, టిక్కీ (70)కిలోల బస్తా కోయడానికి రూ.120లు కూలీ అవుతోంది. గోతాంకు రూ.30, పొలం నుంచి ఊరిలోకి తోలడానికి ఆటోకు రూ.20, అక్కడ నుంచి హైదరాబాద్‌కు బస్తాకు రూ.100తో మొత్తం కలిపి బస్తా మిర్చికి రూ.270 ఖర్చవుతుండగా వచ్చేది మాత్రం 210 రూపాయలే. గతంలో ఉత్తరాది నుంచి ఆర్డర్లు రావడంతో మిర్చికి బాగానే ధర పలికింది. పదిరోజుల నుంచి ఆర్డర్లు లేకపోవడంతో ధర బాగా పడిపోయింది. స్థానికంగా వారపు సంతలు, కూరగాయల దుకాణాల్లో తక్కువకు కొనడం.. ఖర్చులు కూడా రాకపోవడంతో కూలీలతో కోయించి మిర్చిబస్తాలను సమీపంలోని కృష్ణానదిలో పారబోస్తున్నారు. ఇలా రెండు రోజుల నుంచి 200 బస్తాల వరకు రైతులు నదిలో పారబోసి నిరసన తెలిపారు.

Related Posts