పేరుకే పథకం (నల్గొండ)
నల్గొండ, మార్చి 31 (న్యూస్ పల్స్): పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో జాప్యం నెలకొంటుంది. వ్యవసాయానికి అనుబంధంగా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గేదెల పంపిణీ పథకాన్ని 2018 ఆగస్టు నుంచి అమలు చేస్తోంది. బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఈ పథకానికి నిధులు సమకూర్చింది. జిల్లా పరిధిలోని విజయా, నార్ముల్ డెయిరీలో నమోదై ఉన్న పాడి రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో గేదెను పంపిణీ చేయాలన్నది పథకం లక్ష్యం. నేటికీ లక్ష్యం పూర్తికాకపోగా అమలును అర్ధంతరంగా ఆపారు. గతంలో పంపిణీ చేసిన గేదెలు, ఆవులు మృతి చెందినప్పటికీ వాటి స్థానంలో కొత్త వాటిని పంపిణీ చేయలేదు. పాడి పశువుల పంపిణీ పథకం నాలుగు అడుగులు వెనక్కి, అడుగు ముందుకు అన్న చందంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈల్యాబ్‌లో నమోదైన 18,600 మంది పాడి రైతులకు గేదెలు, ఆవులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 6200 యూనిట్లను పంపిణీ చేశారు. పంపిణీ చేసిన పాడి పశువుల్లో ఇప్పటి వరకు 319 చనిపోయాయి. వీటిలో 219 పశువులకు బీమా పరిహారం సెటిల్ అయ్యిందని అధికారులు చెబుతున్నా చనిపోయిన వాటి స్థానంలో 70 పశువులను పంపిణీ చేశారు. తాజాగా మరో 15 చనిపోయినట్లు బాధిత రైతులు చెబుతున్నారు. బీమా పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం నెలకొంటుంది. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలతో పాల ఉత్పత్తి పెరుగుతుందని అందరూ భావించారు. దీనికి విరుద్ధంగా పాల దిగుబడి జిల్లాలో తగ్గిపోయింది. పాడి పశువుల పథకంలో లబ్ధిదారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పథకం యూనిట్ విలువ రూ.80 వేలుగా ఉంది. దీనికి అదనంగా రవాణా ఖర్చుల కింద రూ.5వేలు మంజూరు చేస్తారు. పశువుకు బీమా సదుపాయంతోపాటు ఒక్కో గేదెకు 300 కిలోల దాణాను అందించాల్సి ఉంది. పథకం అమలులో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ప్రతి యూనిట్‌కు రూ.60 వేలు రాయితీ ఇస్తుంది. లబ్ధిదారుడి వాటా కింద రూ.20వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఇతరులకు రూ.40వేలు రాయితీ కింద ప్రభుత్వం సమకూర్చుతుంది. లబ్ధిదారుడు తన వాటా కింద రూ.40వేలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ రాయితీ అధికంగా ఉండటం, బ్యాంకు రుణంతో లింకు లేకపోవడంతో పాడి రైతులు యూనిట్లు తీసుకొనేందుకు పోటీ పడుతున్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్, మండల క్షేత్రస్థాయిలో తహసీల్దారు, ఎంపీడీవో, మండల పశువైద్యాధికారి, డెయిరీ ప్రతినిధి పథకం అమలును పర్యవేక్షిస్తున్నారు.