YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

 అమెరికా లో 20 వేల మందికి కరోనా

 అమెరికా లో 20 వేల మందికి కరోనా

 అమెరికా లో 20 వేల మందికి కరోనా
న్యూయార్క్, మార్చి 31
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరింత ఉద్ధృతంగా సాగుతోంది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని వేలాది మంది పిట్టలా రాలిపోతున్నారు. ప్రపంచంలోని సగానికిపైగా దేశాలు లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినా మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలో దీని వ్యాప్తి రోజుకు సగటున 500గా నమోదయ్యింది. తొలి లక్ష 67 రోజుల్లో చేరుకుంటే, రెండో లక్షను కేవలం 11 రోజుల్లోనే చేరింది. తర్వాత లక్ష వారం రోజుల్లోనూ, ప్రస్తుతం రోజుకు సగటున 66వేల మంది వైరస్ బారినపడుతున్నారు. ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 37వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 7.85 లక్షలు దాటగా, గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా మరో 3వేల మంది మృతిచెందారు. వైరస్ నిర్ధారణ అయినవారిలో 1,65,000 మంది కోలుకుంటే.. మరో 5.52 లక్షల మందిలో స్వల్పంగా లక్షణాలు ఉన్నాయి. అయితే, దాదాపు 30 వేల మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. కరోనా వైరస్ ప్రభావం ఐరోపా దేశాల్లో తీవ్రంగా ఉంది. మొత్తం కరోనా వైరస్ మరణాల్లో 70 శాతం ఐరోపా దేశాల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం.
ఇటలీలో ప్రాణ నష్టం ఊహకు అందని రీతిలో పెరుగుతోంది. అక్కడ కోవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 11,500 దాటింది. సోమవారం మరో 850 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం 11,591 మంది మృతిచెందారు. కరోనా వైరస్‌తో ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించలేదు. సోమవారం మాత్రం కొత్త కేసుల నమోదులో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. 4000 మందిలో వైరస్ నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 101,739కి చేరింది.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఆ దేశంలోనే నమోదవుతున్నాయి. సోమవారం ఒక్క రోజే 20వేలకుపైగా కేసులు నమోదుకావడం గమనార్హం. ప్రస్తుతం ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1.64 లక్షలు దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న న్యూయార్క్, న్యూ జెర్సీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 3,165కు చేరుకోగా.. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో దాదాపు 1,400 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. న్యూయార్క్ రాష్ట్రంలో 70 వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికాలో కరోనా వైరస్‌తో దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. వైరస్ తీవ్రత పెరగడంతో ప్రస్తుతం ఉన్న ఆంక్షలను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.వైరస్‌ తొలిసారి వెలుగుచూసిన చైనాలో మరో ఐదుగురు చనిపోగా, 79 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 3,309కు చేరింది. బాధితుల సంఖ్య 81,530కి చేరింది. అటు స్పెయిన్, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, నెదర్లాండ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా మరణాల్లో స్పెయిన్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఇటలీ తర్వాత ఈ దేశంలోనే అత్యధికంగా 7,716 మంది ప్రాణాలు కోల్పోయారు.అక్కడ మరో 700 మంది మృతిచెందగా, కొత్తగా మరో 7,900 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో స్పెయిన్‌లో కోవిడ్-19 బాధితుల సంఖ్య 87,956కు చేరింది.ఫ్రాన్స్‌, ఇరాన్, బ్రిటన్‌లోనూ కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 3,000 మందికిపైగా బలయ్యారు. సోమవారం అక్కడ మరో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 4వేల మందిలో వైరస్ నిర్ధారణ కాగా, మొత్తం కేసులు 44,500 మందికి వైరస్ సోకింది. జర్మనీలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. సోమవారం ఏకంగా 9వేల మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడ కరోనా కేసుల 67వేలకు చేరాయి. సోమవారం మరో 100 మంది ప్రాణాలు కోల్పోగా, చనిపోయిన వారి సంఖ్య 645కి చేరింది. కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో జర్మనీ ఆర్ధిక మంత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.ఇరాన్‌లో 2,757 మంది, బ్రిటన్‌లో 1,408 మంది, నెదర్లాండ్‌లో 864, మంది, స్విట్జర్లాండ్‌లో 359మంది, బెల్జియంలో 513 మంది చనిపోయారు. టర్కీలోనూ కోవిడ్ కేసులు 10,827కు చేరుకోగా, 168 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్‌లోనూ వైరస్ ఉగ్రరూపం దాల్చింది. అయితే, వైరస్ బారినపడిన బ్రిటన్ యువరాజు కోలుకున్నారు. వైద్యుల సూచనలతో ఆయన స్వీయ నిర్బంధం నుంచి సోమవారం బయటకు వచ్చారు. ఇప్పటి వరకు బ్రిటన్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 22,141గా నమోదయ్యింది.కరోనా భయంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ప్రముఖుల జాబితాలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ చేరారు. ఆయన వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి వైరస్ నిర్ధారణ కావడంతో నెతన్యాహూ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇప్పటి వరకూ తమ దేశంలో కరోనా వైరస్ తీవ్రత అంతగా లేదని నిన్నటి వరకూ ప్రకటనలు చేసిన రష్యా.. మాస్కోలో అనూహ్యంగా సోమవారం లాక్‌డౌన్ విధించింది. దీంతో ఆ నగరంలోని 1.2 కోట్ల మంది జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇతర నగరాల్లోనూ ఆంక్షలు విధించారు.

Related Posts