YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పట్టణ ప్రాంతాల్లో వీలైనంత త్వరగా అర్బన్ ఫారెస్ట్ పార్కులు!!

పట్టణ ప్రాంతాల్లో వీలైనంత త్వరగా అర్బన్ ఫారెస్ట్ పార్కులు!!

పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు వీలైనంత త్వరగా అన్ని సౌకర్యాలతో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అందుబాటులోకి తీసుకురావాలని చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి సంబంధిత శాఖలను ఆదేశించారు.  ప్రతీ ఫారెస్ట్ బ్లాకులో కొంత భాగాన్ని అభివృద్ది చేసి అర్బన్ పార్కుగా సమీప పట్టణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి ఆశయంగా సీ.ఎస్ చెప్పారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఇతర శాఖల సమన్యయంతో పార్కుల అభివృద్దిపై సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది.  ముందుగా రాజధాని హైదరాబాద్ కు చుట్టుపక్కల ఉన్న 188 ఫారెస్ట్ బ్లాకుల్లో 129 ప్రాంతాలను పార్కుల అభివృద్దికి అనువైనవిగా గుర్తించారు. వీటిల్లో 70 ప్రాంతాలను ఫారెస్ట్ కన్జర్వేషన్ జోన్లుగా వృద్ది చేయనున్నారు. మిగతా వాటిల్లో 52 ప్రాంతాలను అర్బన్ ఫారెస్ట్  పార్కులుగా, మరో ఏడు ప్రాంతాలను ఎకో టూరిజం జోన్లుగా అభివృద్ది చేయాలని గుర్తించారు. ఇవన్నీ కూడా హైదరాబాద్ తో సహా చుట్టుపక్కల మరో ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 26 పార్కులు, మేడ్చల్ లో 11, యాదాద్రిలో 6, మెదక్ లో 4, సంగారెడ్డిలో 3, సిద్దిపేటలో 1, హైదరాబాద్ లో 1 పార్కు రానున్నాయి. ఈ యాభై రెండు ఫారెస్ట్ పార్కులను అటవీ శాఖ 15, హెచ్ ఎం డీ ఏ 17, జీ హెచ్ ఎం సీ 3, టి ఎస్ ఐ ఐ సీ 11, ఫారెస్ట డెవలప్ మెంట్ కార్పోరేషన్ 4, మెట్రో రైల్ 2 పార్కులను అభివృద్ది పరచాలని ప్రాధమికంగా నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులు, మానవ వనరుల సమీకరణపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఆయా శాఖలు సొంతగా నిధుల సమీకరణ చేసుకోవానలని, మరికొన్ని శాఖలు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ  నిధులనూ వాడుకోవచ్చని సీ.ఎస్ సూచించారు. వివిధ శాఖలు అర్బన్ పార్కులను అభివృద్ది  చేసి మళ్లీ అటవీ శాఖకు అప్పగిస్తే నిర్వహణ బాధ్యతలు ఆ శాఖ చేపడుతుందన్నారు.  అలాగే అటవీ శాఖ పరిధిలో ఉన్న మరో ఏడు ప్రాంతాల్లో ఎకో టూరిజంను అభివృద్ది చేయనున్నారు. టూరిజం శాఖ ఈ ఏడు ప్రాంతాల్లో  వీటిని చేపడుతుంది. మేడ్చల్ జిల్లా పరిధిలో మూడు, యాదాద్రి జిల్లా పరిధిలో మరో నాలుగు ఎకో టూరిజం పార్కులు రానున్నాయి. వీటన్నింటినీ రానున్న రెండేళ్లలో దశల వారీగా  పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి  ఆదేశించారని, ఆ దిశగా అన్ని శాఖలు పనిచేయాలని సీ. ఎస్ సూచించారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉండి అక్కడి ప్రజలకు అరోగ్య, ఆహ్లాద, విహార సౌకర్యాలకు అనువుగా అన్ని అర్బన్ ఫారెస్ట్ పార్కులను, ఎకో టూరిజం స్పాట్ లను తీర్చి దిద్దాలని నిర్ణయించారు. అటవీ శాఖ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అర్బన్ పార్క్ లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది, భాగ్య నగర్ నందనవనం, మేడిపల్లి ఫారెస్ట్ పార్క్, కండ్లకోయ ఆక్సిజన్ పార్కులు మంచి ఆదరణ వస్తోందన్నారు.

ఈ సమావేశంలో అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అజయ్ మిశ్రా, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, రోడ్లు భవనాలు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, పరిశ్రమలు, ఐ టీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కమిషనర్ చిరంజీవులు, పంచాయతీ రాజ్ సెక్రెటరీ వికాస్ రాజ్,  కళ్యాణ్ చక్రవర్తి, పీ.కే. ఝా,  సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్. ఎం. దోబ్రియల్, రిటైర్డ్ డాక్టర్ మనోరంజన్ భాంజా, టూరిజం శాఖ నుంచి సునీతా భగవత్,  నర్సింహారెడ్డి హాజరయ్యారు.

Related Posts